'అతను మాకు కావాలి.. మీరు బహిష్కరించండి'
న్యూఢిల్లీ: దేశంలో సంచనలం సృష్టించిన లలిత్ గేట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు లలిత్ మోదీని వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని నాటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం బ్రిటన్ కు లేఖ రాసినట్లు తెలిసింది. సమాచారం హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి ఈ విషయంపై వివరణ కోరగా ఈ వివరాలు తెలిశాయి. భారీ కుంభకోణం అనంతరం 2010 నుంచి లలిత్ మోదీ బ్రిటన్ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనను వెనక్కి రప్పించేందుకునాటి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నించిందని చిదంబరం లేఖ ద్వారా తెలుస్తోంది. ఆ లేఖలో.. తప్పు చేసిన అపరాధి అయిన మోదీని ఇక ఎక్కువ రోజులు బ్రిటన్‌లో ఎక్కువ రోజులు ఉండనివ్వాలని అనుకోవడం లేదని, అతడిని తిరిగి వెనక్కి రప్పించే కార్యకలాపాలు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని చిదంబరం విజ్ఞప్తి చేశారు. ఆయనపై ఉన్న తీవ్రమైన నేరాల కేసుల విచారణను భారత్ లోని కీలక విచారణ సంస్థలు పనిచేస్తున్నాయని కూడా అందులో ప్రస్తావించారు.
ఆయన పాస్ పోర్టును చట్ట వ్యతిరేకమైనదిగా తాము గుర్తించినందున ఎక్కువకాలంపాటు ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ పనిచేసే అవకాశం ఉండదని, అయినా అతడు బ్రిటన్ లో ఉంటున్నాడని, వెంటనే అక్కడి నుంచి బహిష్కరించాలని విన్నవించారు. ఇలాంటి తప్పిదాల పేరుతో గతంలో 3000మంది ఇండియన్స్ ను బ్రిటన్ నుంచి బహిష్కరించిన విషయం కూడా చిదంబరం గుర్తు చేశారు. దీనికి బ్రిటన్ స్పందించి తిరిగి బదులు సమాధానం కూడా ఇచ్చింది. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయినా, ఇప్పటివరకు బ్రిటన్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటో తెలియాలి.