
భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, ఆఫీస్‌లపై ఆదివారం ఆదాయ పన్ను శాఖ చేపట్టిన దాడులు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాధ్ ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ సహచరుడు అశ్వని శర్మ నివాసం సహా మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోమవారం ఉదయం నుంచి దాడులు కొనసాగిస్తున్నారు. అశ్వని శర్మ, ప్రవీణ్ కక్కర్ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ చలామణి ఆరోపణలపై ఆదివారం ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో 50 చోట్ల ఐటీ అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 14 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండోర్, భోపాల్, గోవా, ఢిల్లీలో సోదాల్లో కమల్‌నాథ్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) ప్రవీణ్ కక్కడ్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ ఇళ్లలో సోదాలు చేశారు.
ఇక ప్రవీణ్ కక్కర్‌కు అత్యంత సన్నిహితుడైన అశ్విన్ శర్మ నివాసంపై ఆదివారం ఐటీ దాడులు జరిపేందుకు వెళ్లిన అధికారులతో ఇరు పక్షాల మధ్య మీడియా సమక్షంలోనే అరగంటకు పైగా వాగ్వాదం సాగింది. అశ్విన్ శర్మ వ్యాపారవేత్త కావడం గమనార్హం. మరోవైపు సీఎం సన్నిహితులపై ఐటీ దాడుల నేపథ్యంలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఏం చేస్తోందో కమల్‌నాథ్ సారథ్యంలో మధ్యప్రదేశ్‌లోనూ అదే జరుగుతోందని దుయ్యబట్టారు.