టాయ్ లెట్.. ఓ భార్య పోరాటం
ధన్‌బాద్: జార్ఖండ్ లో ఓ భార్య చేసిన పోరాటం ఇతర మహిళల్లో స్ఫూర్తిని నింపుతోంది. మరగుదొడ్డి నిర్మించకుండా ఫోన్ కొనుకున్న భర్తకు చుక్కలు చూపించి చివరకు తాను అనుకున్నది సాధించింది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కింద కేంద్రం సామాన్యులకు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 12000 వేల రూపాయలలో తొలి విడతగా ఆరు వేలు, నిర్మాణం పూర్తయ్యాక మిగతా డబ్బును ఇస్తుంది. భూలి పట్టణానికి చెందిన రాజేశ్ మహ అనే రైతు సొంతిల్లు కట్టుకున్నాడు. కానీ, టాయ్ లెట్ నిర్మించుకోకుండా ధన్‌బాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో సంబంధిత శాఖ నిధులు మంజూరు చేసింది.
అయితే అతగాడు ఆ డబ్బుతో ఓ ఫోన్ కొన్నాడు. విషయం తెలిసిన భార్య లక్ష్మీ దేవి కోపంతో ఆ ఫోన్ ను పగలగొట్టేసింది. అంతేకాదు మరుగుదొడ్డి కట్టించాలంటూ పచ్చితీర్థం కూడా ముట్టకుండా రెండు రోజులు దీక్ష కూడా చేసింది. ఈ రెండు రోజులు మా ఇంట్లో మహాభారత సంగ్రామమే జరిగింది. మహిళలను బహిర్భూమికి ప్రోత్సహించటం ముమ్మాటికీ వారిని అవమానించటమే. నా తప్పు నేను తెలుసుకున్నా, అందుకే అప్పుచేసి మరీ నిర్మిస్తున్నా అని రాజేశ్ తెలిపాడు. అన్నట్లు ఈ శుక్రవారమే విడుదల కాబోతున్న టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథా కూడా స్వచ్ఛ్ భారత్ అభియాన్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న విషయం విదితమే.