సినిమా చూపిస్తా మామ...
రాంచి: ప్రభుత్వ వ్యవస్థకు, అందులో భాగమైన పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా ఇంతకాలం మావోయిస్టులు లేదా మావో సానుభూతిపరులు సినిమాలు తీస్తూ వచ్చారు. భారత్‌లోని మావోయిస్టుల్లో సామాజిక మార్పు తీసుకరావడానికి పోలీసులే మావోయిస్టులపై తొలిసారిగా సినిమా తీశారు. ఇదో విశేషమైతే దాదాపు డజను మంది నిజమైన పోలీసు అధికారులే ఇందులో నటించడం మరో విశేషం.
మావోయిస్టుల ప్రభావం నుంచి ప్రజలను తప్పించడంలో భాగంగా వారితో మమేకమయ్యేందుకు ఇప్పటివరకు పోలీసులు చాలా వేశాలే వేశారు. ముఖ్యంగా మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉన్న జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రల్లో ప్రజలతో కలసి ఆటల పోటీల్లో పాల్గొన్నారు. మావోయిస్టుల ప్రభావం నుంచి ప్రజలను దూరం చేసేందుకు నాటకాలు, రూపకాలు వేశారు. ఇప్పుడు నేరుగా మావోయిస్టులనే ప్రభావితం చేసి హింసామార్గాన్ని వదిలిపెట్టి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకరావడానికి వారినే ఇతివృత్తంగా చేసుకొని సినిమా తీశారు.
‘ప్రత్యవర్తన్ ’(హోం కమింగ్-ట్యాగ్) టైటిల్‌తో జార్ఖండ్ పోలీసులు తీసిన ఈ చిత్రంలో జార్ఖండ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు పలువురితోపాటు మాజీ డీజీపీ రాజీవ్ కుమార్ సినిమాలో డీజీపీగా నటించారు. స్థానిక మల్టీప్లెక్స్‌లో గురువారం సాయంత్రం ఈ చిత్రం ప్రీమియర్ ప్రదర్శించారు. ప్రజల వీక్షణ కోసం నవంబర్ 13వ తేదీన విడుదల చేస్తున్నారు.
పార్టీ సిద్ధాంతం నుంచి మావోయిస్టులు గాడి తప్పుతున్నారని భావిస్తున్న ఓ మావోయిస్టు జోనల్ కమాండర్ జీవితం చుట్టూ చిత్రం కథ నడుస్తుంది. ఎన్నో మలుపులు ఉండే ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఓ ప్రేమ కథను కూడా జోడించారు. ఓ మావోయిస్టు యువకుడు రేప్‌కు గురవుతున్న ఓ అమ్మాయిని రక్షించి ఆమెకు దగ్గరవుతాడు. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలనే తన నాయకుల అంచనాలకు, ప్రేమకు మధ్య నలిగిపోతాడు.
జనజీవన స్రవంతిలోకి తీసుకరావడం కోసం మావోయిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఓ సినిమా తీయాలనే ఆలోచన జార్ఖండ్ డీజీపీగా ఉన్నప్పుడు రాజీవ్ కుమార్‌కు 2013లోనే వచ్చింది. ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది. నిమూ భౌమిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ సింగర్ షాన్ ఇంపైన పాటలు పాడారు.శ్రీల మజుందార్, మౌసమీ భట్టాచార్య, ఇషాన్, సైకత్ ఛటర్జీ తదితరులు కూడా నటించారు.