
కన్హయ్యకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ : జెఎన్‌యూ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ జ్యూడీషియల్ కస్టడీ మార్చి 2వ తేదీ వరకూ కోర్టు పొడిగించింది. కాగా దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన కన్హయ్య కుమార్ రిమాండ్ నేటితో ముగియటంతో అతడిని ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు యత్నిస్తుండగా అక్కడే ఉన్న కొందరు న్యాయవాదులు అతడిపై దాడికి దిగారు. అతన్ని చుట్టుముట్టిన పలువురు న్యాయవాదులు పిడిగుద్దులు కురిపించారు. లాయర్ల బారి నుంచి అతడిని తప్పించేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో అతడు గాయపడ్డాడు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. పాటియాల హౌస్ కోర్టులో తాజా ఘటనలపై విచారణ పరిశీలనకు ఆరుగురు సీనియర్ సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తూ జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా అంతకు ముందు జెఎన్యూ విద్యార్థులకు, న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, మరోవైపు న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయి దాడికి దిగారు. ఈ ఘటనలో విద్యార్థులతో పాటు ఓ జర్నలిస్టు కూడా గాయపడ్డాడు.