ఇన్నేళ్లయినా అస్సలు హ్యాపీ లేదట
శ్రీనగర్: కొంతమంది వ్యక్తుల జీవితాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో ఎవరికీ అర్ధంకాదు. ఒక్కోసారి ఏం లేకపోయినా సంతోషం ఉంటే ఒక్కోసారి మాత్రం అన్నీ ఉన్నా సంతోషం మాత్రం దగ్గరికి రాదు. ప్రస్తుతం కాశ్మీర్లోని పండిట్ల అంశం కూడా అలాగే తయారైంది. దాదాపు 20 ఏళ్లపాటు జమ్మూప్రాంతంలో గడిపిన వీరంతా ప్రస్తుతం కశ్మీర్ లోయ ప్రాంతానికి తరలి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఆనందం మాత్రం తమ దరి చేరలేదని వారు వాపోతున్నారు. ముఖ్యంగా బుద్గా జిల్లాలోని షేకాపోరా అనే ప్రాంతంలో ఉంటున్న వీణా కౌల్(60) అనే వ్యక్తిని ప్రశ్నించినప్పుడు వారి దయనీయ పరిస్థితి కనిపించింది.
ఒకే అపార్ట్ మెంట్లలో రెండు రెండు కుటుంబాలు, ఆ కుటుంబాలకు ఒకటే కిచెన్, ఒకటే బాత్ రూం, ఇతర అంశాలు కూడా పరస్పరం పంచుకోవాల్సి రావడంతోపాటు మరింకెన్నో సమస్యలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో తాండవిస్తున్నాయి. దీంతో తిరిగి తమ నివాస ప్రాంతానికి వచ్చామన్న సంతోషం మాత్రం కరువైందని వారు వాపోతున్నారు. మొత్తం 1200 మంది కశ్మీర్ పండిట్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆయా ప్రాంతంలో స్థిరపడ్డారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. కానీ, రేషన్ కార్డులుగానీ, ఓటరు గుర్తింపుకార్డులుగానీ ఇవ్వలేదు. పునరావాసానికి సంబంధించి ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టలేదు. తీవ్రవాదం కారణంగా కశ్మీర్ పండిట్లు చెల్లా చెదురవగా తిరిగి కేంద్ర ప్రభుత్వం వారిని ఒకచోటకు చేరుస్తున్న విషయం తెలిసిందే.