పార్లమెంటుకు ట్యాక్సీల్లో రావాలా?
విభేదాలు పక్కనపెట్టి ఏకమైన ఎంపీలు
న్యూఢిల్లీ: నిత్యం ఏదో ఒక విషయంలో పార్టీల పరంగా విభేదించుకుంటూ.. పార్లమెంటులో రచ్చరచ్చ చేసే ఎంపీలంతా ఒక విషయంలో మాత్రం ఏకమయ్యారు. పార్టీకతీతంగా అందరూ కలిసి ఒకే గొంతు వినిపించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి నిబంధనను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ నిబంధన నుంచి తమను మినహాయించాలని పార్లమెంటులో ఎంపీలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ట్రాఫిక్ నియంత్రించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనాల నంబర్ ప్లేట్ల ఆధారంగా సరి-బేసి నిబంధనను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిబంధనలతో పార్లమెంటుకు రాకుండా ఎంపీలను అడ్డుకుంటున్నారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ నిరసన వ్యక్తం చేశారు. సరి-బేసి నిబంధన కారణంగా పార్లమెంటుకు రావడం కష్టంగా మారిందని ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం కావడంతో పార్లమెంటుకు బయలుదేరిన పలువురు ఎంపీలకు సరి-బేసి షాక్ తగిలింది. సరి-బేసిని ఉల్లంఘించి బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ తన వాహనంలో దర్జాగా పార్లమెంటుకు వచ్చారు. దీనిపై విలేకరులు ప్రశ్నించడంతో ఆయన క్షమాపణ చెప్పారు. ఇతర ఎంపీలూ ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో సరి-బేసి నిబంధన నుంచి ఎంపీలను మినహాయించాలని, తాము ట్యాక్సీల్లో పార్లమెంటుకు రాలేమని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.