తిరువనంతపురంః పుట్టింగళ్ దేవీ ఆలయ ఉత్పవాల్లో జరిగిన ఘోర ప్రమాదంలో 114 మంది వరకూ మృతి చెందగా.. దుర్ఘటనలో 350 మంది వరకూ తీవ్రంగా గాయపడి నేటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలను సులభంగా వదిలేయడానికి లేదని, విపత్తు బాధితుల దీర్ఘకాల అవసరాలకు ప్రత్యేక నిధిని సమకూర్చాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. విషాదంపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
పుట్టింగళ్ ఆలయ ప్రమాదంలో గాయాలపాలైనవారు తిరిగి సాధారణ జీవితం పొందడానికి చాలా సమయం పడుతుందని, వారికి అన్ని విధాలుగా సహాయపడేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. మత సంస్థలతో సంబంధం ఉన్న సంఘటనలపై ఏకాభిప్రాయం కుదరడం కష్టమని, ఆచరణాత్మకం కూడ కాదని చెప్పిన సీఎం... ఎన్నో నిబంధనలు, నిషేధాజ్ఞలు, చట్టాలు ఉన్నప్పటికీ ఇటువంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని, ఇకముందైనా ఇటువంటి విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అఖిలపక్ష సమావేశం అనంతరం తెలిపారు. గంటన్నరపాటు జరిగిన సమావేశంలో సుమారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. త్వరలో రాబోయే త్రిస్సూర్ పూరమ్ వేడుకలపై కూడ ఈ సందర్భంలో చర్చించారు. రాష్ట్రంలోనే ప్రధాన పండుగగా పరిగణించే ఈ పండుగకు సైతం అనుమతిని మంజూరు చేసిన ప్రభుత్వం తగిన నియమ నిబంధనలను కఠినంగా పాటించేట్లు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ప్రత్యేక పండుగ త్రిస్సూర్ పూరమ్ అని, ఈ పండుగను నిషేధించడం సాధ్యం కాదని, నిబంధనలు, నిషేధాజ్ఞలు పటిష్గంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సమావేశం సందర్భంలో రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితల తెలిపారు.
మరోవైపు పుట్టింగళ్ ఆలయ ప్రాంగణాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించిన ముగ్గురు మంత్రుల కమిటి అక్కడ జరిగిన నష్టాల అంచనాను వచ్చే బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో నివేదిస్తుందని, తదుపరి మంత్రివర్గం తగిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యంత్రి చాందీ తెలిపారు. కొల్లం ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు కూడ ఈ సందర్భంలో అఖిల పక్షం నిర్ణయించినట్లు తెలిపారు.
పుట్టింగళ్ విపత్తు బాధితుల నిధి ఏర్పాటు
Published Thu, Apr 14 2016 7:40 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement