న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీకి బుధవారం అంతిమ వీడ్కోలు పలికారు. ఆమె అంత్యక్రియలు లోధీ రోడ్డులోని విద్యుత్ దహనవాటికలో జరిగాయి. 13, తల్కటోరా రోడ్డులోని కుమారుడు అభిజిత్ నివాసం నుంచి భౌతికకాయాన్ని దహనవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తదితరులు హాజరయ్యారు. చితాభస్మాన్ని ఆమె కుటుంబసభ్యులు హరిద్వార్‌కు తీసుకెళ్లి గంగానదిలో కలిపారు. శుభ్రా శ్వాససంబంధ వ్యాధితో మంగళవారం మృతిచెందడం తెలిసిందే.
బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం ఢాకా నుంచి వచ్చి ప్రణబ్‌ను పరామర్శించారు. శుభ్రాముఖర్జీ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. 1975లో బంగ్లా స్వతంత్ర పోరాట సమయంలో దేశ బహిష్కారానికి గురైనప్పుడు భారత్‌లో తలదాచుకున్న హసీనాకు ప్రణబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. శుభ్రా అంత్యక్రియలు పూర్తయిన కాసేపటి తర్వాత ప్రణబ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని తిరిగి అధికార విధులు ప్రారంభించారు.
శుభ్రా ముఖర్జీకి అంతిమ వీడ్కోలు
Published Thu, Aug 20 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM
Advertisement
Advertisement