చాటింగ్‌తో మొదలు..
‘ఆమె ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్. వయసు 26 ఏళ్లు. డేటింగ్ యాప్ ద్వారా 2018, జనవరిలో 27 ఏళ్ల యువకుడు పరిచయమయ్యాడు. అతనూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరూ మొబైల్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని చాటింగ్ ప్రారంభించారు. మనసులు కూడా కలవడంతో సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో విహారయాత్రలకు వెళ్లారు. ఆ యువకుడు తన ప్రియురాలి ఫోటోను ఓ స్నేహితుడికి చూపించాడు. ఆమె తనకు తెలుసని మిత్రుడు చెప్పాడు. ఆమె ఇంకా చాలా మందితో అఫైర్ కొనసాగించినట్లు తెలుసుకుని యువకుడు కంగుతిన్నాడు’
పార్టీలో కలిశారు..
‘ఉత్తర భారత్‌కు చెందిన 22 ఏళ్ల యువతి నగరంలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతోంది. 2018లో స్నేహితుడి ఇంటికి పార్టీకి వెళ్లినప్పుడు 31 ఏళ్ల టెక్కీ పరిచయం అయ్యాడు. అభిరుచులు కలిసి సహజీవనం ప్రారంభించారు. ఆతర్వాత అతనితో పెళ్లి ఇష్టం లేదంటూ ఆ యువతి తన సొంతూరుకి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోను చూపి బెదిరించడం ప్రారంభించాడు. ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు’
వెలుగులోకి రానివెన్నో
టెక్ హబ్‌గా పేరొందిన బెంగళూరు సహజీవనానికి కూడా కేంద్రంగా మారుతోంది. పైన చెప్పిన సంఘటనలు కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. నగరంలో ఇంకా వెలుగుచూడని ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే సాకుతో పెళ్లి అనే సంప్రదాయానికి తూట్లు పొడిచి విదేశాల్లో ప్రాచుర్యం పొందిన సహజీవనం పేరిట యువత కొన్ని నెలల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.
తరువాత ఒకరితో ఒకరికి పొసగకనో, మరో కారణంతోనో విడిపోతున్నారు. కొందరు ఇంతటితో ఆగకుండా సహజీవనంతో మోసపోయామని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఒక్క 2018లోనే కర్ణాటక వ్యాప్తంగా ఇలాంటి కేసులు 300కు పైగా నమోదయ్యాయి. ఫేస్‌బుక్, ఇతర డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులతో సహజీవనం చేసేందుకు చాలా మంది యువత సిద్ధమవుతున్నారు. ఆకర్షణ కూడా సహజీవనానికి ఒక కారణంగా తెలుస్తోంది. బాధితుల్లో యువతీయువకులు ఇద్దరూ ఉంటున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్ సులువుగా దొరుకుతోంది. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, బెంగళూరు
Comments
Please login to add a commentAdd a comment