బడ్జెట్ కోసమే అలా చేశారు!
► ఎంపీ మృతిపై పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాల డిమాండ్
► ముందే అహ్మద్ చనిపోయినట్లు సమాచారం ఉందన్న ఆజాద్
► లోక్‌సభలో ‘పాతనోట్లుంటే శిక్ష–జరిమానా’ బిల్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు శుక్రవారం గందరగోళంగా మారాయి. గుండెపోటుతో మాజీ మంత్రి, ఐఎంయూఎల్ చీఫ్, ఎంపీ ఈ అహ్మద్ మృతిచెందిన విషయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదని, బడ్జెట్ కొనసాగించేందుకే వైద్యులతో తప్పుడు ప్రకటనలు చెప్పించారంటూ విపక్షాలు మండిపడ్డాయి. అటు రోజ్‌వాలీ చిట్‌ఫండ్ స్కాంలో తమ ఎంపీలను అరెస్టు చేయటంతోపాటు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. తృణమూల్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్రం తమ ఎంపీలపై సీబీఐ ద్వారా ఒత్తిడి పెంచుతోందని నినాదాలు చేశారు. ‘సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారింది. రాజకీయ అవసరాల కోసం కేంద్రం సీబీఐని వినియోగించుకుంటోంది’ అని తృణమూల్ ఎంపీలు విమర్శించారు.
దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ఎంపీ, ఐఎంయూఎల్ అధ్యక్షుడు అహ్మద్‌కు సరైన చికిత్స అందలేదని.. ఆయన మృతిపై కూడా ప్రభుత్వ స్పందన సరిగా లేదని కేరళ ఎంపీలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేశారు. వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ గొడవ మధ్యే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆదేశించారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మ చర్చను ప్రారంభిస్తుండగానే మళ్లీ సభలో గందరగోళం నెలకొంది. రెండుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో.. స్పీకర్ సుమిత్ర మహాజన్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు.
లోక్‌సభ ముందు ‘పాతనోట్లుంటే శిక్ష’ బిల్లు
నవంబర్8 నిర్ణయంతో రద్దుచేసిన పాతనోట్లను దాచుకున్నా, బదిలీ చేసినా, తీసుకున్నా క్రిమినల్ చర్యలతోపాటు రూ.10వేల జరిమానా విధించే బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా ఈ బిల్లు అనైతికం, దేశ వ్యతిరేకమని తృణమూల్ కాంగ్రెస్ నేత సుగత రాయ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై జైట్లీ కూడా ఘాటుగానే స్పందించారు. ఏ ప్రాతిపదికన తృణమూల్ దీన్ని వ్యతిరేకిస్తుందో చెప్పాలన్నారు. అయితే.. ఈ బిల్లు లోక్‌సభ నిబంధనలకు విరుద్ధమని జైట్లీ లోక్‌సభ సభ్యుడు కానందున ఆయనకు నిబంధనలేమీ తెలియవని సుగత రాయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.
70వేల మంది చిన్నారులకు మధుమేహం
2015లో భారతదేశంలో 70వేలకు పైగా చిన్నారులు మధుమేహం బారిన పడ్డారని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. అటు, ఉగ్రవాదానికి సహకరించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని రాజ్యసభ ఎంపీ ఒకరు ఓ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలంటూనే.. ‘56 అంగుళాల ఛాతీ ఎక్కడికెళ్లింది’ అని విమర్శించారు.
ప్రభుత్వానికి ముందే తెలుసు!
జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగం జరుగుతుండగా సెంట్రల్ హాల్‌లోనే ఎంపీ అహ్మద్ కుప్పకూలిపోయారు. ఫిబ్రవరి 1న ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలున్నందున.. సమావేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయన ముందురోజే చనిపోయినా ఇంకా బతికే ఉన్నాడనే సందేశాన్ని ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయని ఖర్గే ఆరోపించారు. అహ్మద్ కూతురు, అల్లుడికి ఆసుపత్రి లోపలకు అనుమతించలేదన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే అతను మృతిచెందినట్లు కొందరు డాక్టర్లు తనతో చెప్పారని ఆజాద్ అన్నారు.