'ఆ తీర్పు'ను రద్దుచేసిన హైకోర్టు
చెన్నై: అత్యాచారం కేసులో రాజీ కుదుర్చుకోమని బాధితురాలికి సలహా ఇస్తూ, అందుకుగాను నేరస్తుడికి బెయిల్ మంజూరు చేసిన వివాదాస్పదమైన తీర్పును మద్రాస్ హైకోర్టు వెనక్కి తీసుకుంది. రేప్ కేసుల్లో మధ్యవర్తిత్వం నేరమని, ఇది మహిళల గౌరవానికి భంగకరమని జూలై 1న సుప్రీం తేల్చి చెప్పిన నేపథ్యంలోనే కోర్టు శనివారం తన తీర్పును రద్దు చేసింది.
జస్టిస్ పి.దేవదాస్ ఆధ్వర్యంలో మద్రాస్ హైకోర్టు నేరస్తుడితో రాజీ చేసుకోమని కోరుతూ అతనికి బెయిల్ చేయడంతో పాటు, అతన్ని పెళ్లి చేసుకోవాలని కూడా సూచించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. కొంతమంది న్యాయవాదులు దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. అయితే హైకోర్టు సూచనను బాధితురాలు నిరాకరించింది. మైనర్గా ఉన్నపుడే ఆమె అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
కాగా లైంగిక దాడి చేసిన వ్యక్తులతో రాజీ కుదుర్చుకోమని కోరడమంటే నేరస్తుల పట్ల మెతక వైఖరి చూపించినట్లు అవుతుందని , రాజీ చేయడమంటే మహిళా హక్కులను కాలరాయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది చాలా తీవ్రమైన తప్పిదమని పేర్కొంటూ మద్రాసు హైకోర్ట్ తీర్పును తీవ్రంగా దుయ్యబట్టిన సంగతి తెలిసిందే.