శరద్ పవార్ బాంబు పేల్చారు!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాంగ్రెస్ కి మిగిలిన అతికొద్దిమంది మిత్రుల్లో ఒకరైన శరద్ పవార్ ఉన్నట్టుండి బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేస్తోందని, మళ్లీ అశోక్ చవాన్ లేదా సుశీల్ కుమార్ షిండే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ప్రకటించారు.
నిజానికి ఈ ప్రకటన కాంగ్రెస్ అధిష్టానం నుంచి రావలసింది. కానీ కాంగ్రెస్ మిత్రపక్షం నుంచి వస్తోంది. అదే విచిత్రం. అంతే కాదు. మిజోరాం, అసొం ముఖ్యమంత్రులను కూడా కాంగ్రెస్ మార్చేయబోతోందని ఆయన ప్రకటించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కి ఎన్ సీ పీకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. శరద్ పవార్ మేనల్లుడు, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ చాలా కాలంగా ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి మహారాష్ట్ర లోకసభ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఘోరపరాజయం తరువాత పృథ్వీరాజ్ ను తొలగించాలన్న డిమాండ్ బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానంపై శరద్ పవార్ ఒత్తిడి తెచ్చారు. దాని ఫలితంగానే కాంగ్రెస్ సీఎంను మార్చాలని భావించి ఉండొచ్చని తెలుస్తోంది.
అయితే పవార్ మాత్రం ఈ నిర్ణయం వెనుక తన ఒత్తిడేమీ లేదని అంటున్నారు. తనకు అసలు కాంగ్రెస్ అంతర్గత విషయాలతో సంబంధమే లేదని ఆయన అన్నారు.