
దుర్గా నిమజ్జనంపై ఆంక్షలొద్దు
► మొహర్రం రోజునా నిమజ్జనానికి హైకోర్టు అనుమతి
► ఆంక్షలు విధించడం పట్ల మమతా బెనర్జీపై కోర్టు మండిపాటు
► గొంతు కోసినా కుట్రకు బలికానన్న మమత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని మొహర్రం పండుగనాడు సహా అన్ని రోజుల్లోనూ అర్ధరాత్రి 12 వరకు నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. నిమజ్జనంపై ఆంక్షలు విధించినందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది. పౌరులు తమ మతాచారాలను పాటించకుండా అడ్డుకునే హక్కు ప్రభు త్వానికి లేదని తేల్చిచెప్పింది. మతి లేకుండా హక్కులను హరించకూడదని ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. మొహర్రం ఉరేగింపు, దుర్గా విగ్రహాల నిమజ్జనం ఒకేరోజున జరుగుతాయనీ, అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించింది.
మీకు కల వస్తే ఆంక్షలు విధించలేరు
మొహర్రం ఊరేగింపు, నిమజ్జనం ఒకే రోజున చేపడితే మత కలహాలు చెలరేగుతాయంటూ నిమజ్జనంపై గతంలో మమత కొన్ని ఆంక్షలు విధించారు. విజయదశమి రోజున రాత్రి 10 గంటల వరకే నిమజ్జనానికి అనుమతించడంతోపాటు, మొహర్రం రోజైన అక్టోబరు 1న నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా, ఆ వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ తివారీ, జస్టిస్ హరీశ్ టాండన్‌ల ధర్మాసనం విచారించింది.
‘అధికారం ఉంది కదా అని మీరు (మమత) సరైన కారణాలు లేకుండానే ఇష్టం వచ్చినట్లు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణిస్తాయన్న ఊహలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించకూడదు. ఏదో అనర్థం జరగబోతోందని మీరు కలగన్నంత మాత్రాన ఆంక్షలు విధించలేరు’ అంటూ ధర్మాసనం మమతకు మొట్టికాయలు వేసింది. దుర్గామాత విగ్రహాలు, మొహర్రం ఊరేగింపునకు వేర్వేరు మార్గాలను నిర్దేశించాలనీ, ఊరేగింపు వెళ్లే దారుల గురించి ప్రజలకు తెలియజెప్పాలని కోర్టు ఆదేశించింది.
కుట్రదారులదే బాధ్యత: మమత
తీర్పు అనంతరం మమత బీజేపీని పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడుతూ అక్టోబరు 1న హింస చెలరేగితే కుట్రదారులదే బాధ్యత అని అన్నారు. ‘నా గొంతు కోసినా సరే. కుట్ర కు నేను బలికాను. ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు’ అని ఆమె అన్నారు.