
నితీశ్ ఆ విషయం మరిచారు: తేజస్వీ
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజల నిర్ణయాన్ని అగౌరవపరిచారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. శుక్రవారం అసెంబ్లీలో ఎదుర్కొన్న బలపరీక్షలో విజయం సాధించారు. అనంతరం తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నిర్ణయాన్ని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే గౌరవించకపోవడం వారిని కించపరచడమేనని, ప్రజాస్వామ్యానికి నితీశ్ తూట్లు పొడిచారని వ్యాఖ్యానించారు.
2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పడిన మహాకూటమి (ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్) నే గెలిపించారు తప్ప.. నితీశ్‌ను కాదని అభిప్రాయపడ్డారు. సీఎం నితీశ్‌కు రానున్న రోజుల్లో బిహార్ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తన ప్రశ్నలకే సమాధానం చెప్పిన నితీశ్ ప్రభుత్వం ఇక ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని బదులిస్తారని తేజస్వీ ప్రశ్నించారు. నితీశ్ ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవగా 1995లో ఏడు సీట్లు, 2014లో రెండు సీట్లు వచ్చాయని, 2015 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను మాత్రం మహాకూటమి బలంతోనే ఎదురించిన విషయం నిజంకాదా అని ప్రశ్నించారు. అయితే నితీశ్ మాత్రం ప్రజలు తననే సీఎం చేశారని భ్రమ పడుతున్నారని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు.
243 సీట్లున్న బిహార్‌లో సాధారణ మేజార్టీ 122 సీట్లు కాగా, అసెంబ్లీలో నేడు జరిగిన విశ్వాసపరీక్షలో నితీశ్ ప్రభుత్వానికి అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 108 ఓట్లు పోలయ్యాయి. దీంతో జనతా దళ్ యూనైటెడ్(జేడీయూ), భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని తేలిపోయింది.