న్యూఢిల్లీలో 'మరో మణిపురి' దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మణిపురికీ చెందిన జింగ్రామ్ కెన్గో (33)ను ఆగంతకులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆగంతకులు పరారైయ్యారు. జింగ్రామ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన హస్తినలోని కోట్ల ముబారక్పూర్ ప్రాంతంలో గత రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్య దొంగతనం కోసం చేసినదిగా లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. జింగ్రామ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. పీహెచ్డీ చేసేందుకు మృతుడు జింగ్రామ్ నెల క్రితమే మణిపూర్ నుంచి హస్తినకు తరలి వచ్చాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో జింగ్రామ్ పీహెచ్డీ చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.