ముంబై: విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కోరుతూ మరాఠా సంఘాలు మరోసారి బంద్ నిర్వహించాయి. ఆందోళనకారులు రాష్ట్రంలోని లాతూర్, జాల్నా, సోలాపూర్, బుల్దానా, అహ్మద్‌నగర్, నాసిక్ జిల్లాల్లో ట్రాఫిక్‌ను అడ్డుకోవడంతో పాటు టైర్లను కాల్చి నిరసన తెలిపారు. పుణే కలెక్టర్ కార్యాలయం సెక్యూరిటీ గార్డు గది అద్దాలు, బల్బులు పగలగొట్టారు. దీంతో వదంతులు వ్యాపించకుండా పుణే జిల్లాలో అధికారులు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఔరంగాబాద్‌లో ఆందోళనకారులు ఓ పోలీస్ కారుతో పాటు 2 ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు.
లాఠీచార్జ్ చేసిన పోలీసులు.. అల్లరిమూకల్ని చెదరగొట్టారు. నాందేడ్‌లో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ నడుపుతున్న దినపత్రిక ‘సత్యప్రభ’తో పాటు మరో మరాఠీ పత్రిక పుధారి ఆఫీసులపై రాళ్లు రువ్వారు. లాతూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే త్రిబంక్‌రావ్ భింసేను చుట్టుముట్టిన ఆందోళనకారులు ఆయన్ను పక్కకు నెట్టివేశారు. బారామతిలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటిముందు మరాఠాలు ధర్నాకు దిగగా.. శరద్ బంధువు అజిత్ పవార్ వారికి సంఘీభావంగా ధర్నాలో కూర్చున్నారు.
మరాఠా సంఘాల ఐక్యవేదిక ‘సకల్ మరాఠా సమాజ్’ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు గురువారం సెలవు ప్రకటించారు. మరోవైపు బంద్‌కు సంఘీభావంగా రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్ బంకులు, షాపులు, మార్కెట్లు మూతపడ్డాయి. ప్రస్తుతం మరాఠాల రిజర్వేషన్‌పై తాము పనిచేస్తున్నామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినప్పటికీ మరాఠా>లు శాంతించలేదు. మహారాష్ట్ర జనాభాలో 30 శాతంగా ఉన్న మరాఠాలు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తుండటం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment