సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్న అనంతరం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాహాటంగా జిహాద్ పిలుపు ఇవ్వడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ తీరు అసాధారణ ప్రవర్తనలా ఉందని, ఆయన పదవికి ఏమాత్రం తగనిదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. కశ్మీరీ కోసం నిలబడిన వారు జిహాద్ చేస్తున్నారని, ప్రపంచం వారిని పట్టించుకోకపోయినా పాకిస్తాన్ కశ్మీరీలకు బాసటగా నిలుస్తుందని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాము జిహాదీలకు మద్దతిస్తామని, తమతో అల్లా సంతోషంగా ఉండేదుకు తాము ఇలా చేస్తున్నామని ఇమ్రాన్ పేర్కొన్నారు. పొరుగు దేశంలా పాకిస్తాన్ వ్యవహరించడం లేదని రవీష్ కుమార్ మండిపడ్డారు. బాహాటంగా జిహాద్‌కు పిలుపు ఇవ్వడం అసాధారణ ప్రవర్తనేనని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి వేదిక నేపథ్యంలోనూ ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టే బాధ్యతారాహిత్య ప్రకటనలు చేశారని రవీష్ కుమార్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment