
'అఖిలపక్ష సమావేశం సంతృప్తిగా జరిగింది'
న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో.. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ఎన్డీఏ కోరింది. అలాగే పెండింగ్ బిల్లుల ఆమోదంపై చర్చ జరిగింది. జీఎస్టీ బిల్లుతో సహా పలు కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. ఈ సందర్భంగా అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చాయని, సమావేశం సంతృప్తిగా జరిగిందని మంత్రి అనంతకుమార్ తెలిపారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ తరఫున మేకపాటి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు అన్ని పార్టీలు అంగీకరించాయని, ఈ బిల్లుతో అందరికీ మేలు జరుగుతుందని అన్నారు.