సాక్షి, చెన్నై: భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ నేపథ్యంలో కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మోదీ-జిన్‌పింగ్ అనధికార శిఖరాగ్ర భేటీలో కశ్మీర్ అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే స్పష్టం చేశారు. కశ్మీర్ భారత అంతర్గత విషయమన్న మన వైఖరికి అందరికీ సుస్పష్టంగా తెలిసిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార లాంఛనాలకు లేకుండా రెండురోజులపాటు జరిగిన మోదీ-జిన్‌పింగ్ సమావేశాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శనివారం మీడియాతో మాట్లాడారు.
‘మొదట ఇద్దరు నేతలు 90 నిమిషాలపాటు చర్చించుకున్నారు. ఆ తర్వాత ప్రతినిధులస్థాయి చర్చలు జరిగాయి. అనంతరం మోదీ ఇచ్చిన మధ్యాహ్న విందును జిన్‌పింగ్ స్వీకరించారు. ఈ సదస్సులో భాగంగా మొత్తం ఆరు గంటల పాటు ఇరునేతలు ముఖాముఖి భేటీ అయ్యారు. భారత్, చైనా మధ్య పరస్పర సహకారం, పర్యాటకం, వాణిజ్యం తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, చైనా ఉపాధ్యక్షుడు హు చున్‌హువా దీనిపై చర్చించనున్నారు’ అని ఆయన తెలిపారు. ప్రధాని మోదీని జిన్‌పింగ్ చైనాకు ఆహ్వానించారని, మోదీ కూడా అంగీకరించారని, త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేస్తామని విజయ్ గోఖలే వెల్లడించారు.
మోదీ థ్యాంక్స్..
అనధికార శిఖరాగ్ర చర్చలు ముగిసిన అనంతరం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ట్విటర్‌లో చైనీస్ భాషలో కృతజ్ఞతలు తెలిపారు. భారత్ వచ్చినందుకు జిన్‌పింగ్‌కు థాంక్స్ చెప్పిన మోదీ.. చెన్నై వారధిగా భారత-చైనా సంబంధాలు గొప్పగా ముందుకుసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముగిసిన జిన్‌పింగ్ పర్యటన
రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్ తన పర్యటన ముగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జిన్‌పింగ్ కాన్వాయ్ వద్దకు స్వయంగా వెళ్లి ఆయనను సాగనంపారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీతో చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు. మోదీ ఆతిథ్యం తమను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. ఈ పర్యటన అనంతరం చైనా అధ్యక్షుడు నేరుగా నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment