ఆప్ ఎమ్మెల్యేపై లైంగికదాడి కేసు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను కష్టాలు వీడటం లేదు. పార్టీ పరంగా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఇలా ప్రకటించారో లేదో.. ఆయనపై జామియా నగర్ పోలీసు స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఆ ఫిర్యాదు ఇచ్చింది కూడా ఎవరో కాదు.. సాక్షాత్తు ఖాన్ బావమరిది భార్యే!! గత నాలుగేళ్లుగా అమానతుల్లా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో అమానతుల్లాతో పాటు ఆయన బావమరిదిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తనతో సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఆమానతుల్లా ఒత్తిడి చేసేవారని, తన అత్తమామలు వరకట్నం కోసం తరచు చిత్రహింసలు పెట్టేవారని కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త సైతం.. అమానతుల్లాతో వివాహేతర సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఒత్తిడి చేసేవాడని తెలిపారు. ఆమె చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసుతో ఆమ్ ఆద్మీ పార్టీ మీద మరో పెద్ద మచ్చ పడినట్లయింది. పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ అమానతుల్లా ఖాన్ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు లేఖ ఇచ్చిన కొద్ది సేపటి తర్వాతే ఈ ఫిర్యాదు విషయం వెలుగులోకి వచ్చింది. తనపై వస్తున్న వివిధ ఆరోపణలకు వివరణలు ఇచ్చుకోలేక తాను అలసిపోయానని ఖాన్ అన్నారు. తాను ఎన్నికైన రోజు నుంచి ఢిల్లీ ప్రజలకు సంపూర్ణ నిబద్ధతతో సేవలు చేశానని తెలిపారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా నియమితుడినైన వెంటనే పాత ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి విషయాలను వెలుగులోకి తెచ్చానని, కానీ తన నిజాయితీ కొందరికి నచ్చలేదని అన్నారు. అందుకే తనపైన, తన కుటుంబ సభ్యులపైన తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు.