విమానయానం మరింత చేరువ!
కొత్త నిబంధనలను ప్రతిపాదించిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా... పౌర విమానయాన నిబంధనల్లో కేంద్రం కొన్ని మార్పులను ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి వస్తే టికెట్ రద్దు రుసుము సహా అదనపు బ్యాగేజ్‌పై చార్జీలు తగ్గుతాయి. ప్రయాణికుల నుంచి అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలోనే కొత్త నిబంధనలు ప్రతిపాదించామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు తెలిపారు.
కొత్త నిబంధనలు హర్షణీయం: ఏపీఏఐ
ప్రభుత్వపు కొత్త నిబంధనలపై ఏ దేశీ విమానయాన సంస్థ కూడా స్పందించకపోయినప్పటికీ ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏపీఏఐ) మాత్రం వీటిని స్వాగతించింది. ‘ప్రభుత్వపు కొత్త నిబంధనలు ప్రశంసనీయం. తాజా ప్రతిపాదనలతో చాలా మందికి విమాన ప్రయాణం చేరువవుతుంది. దీంతో దేశీ విమానయాన పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుంది’’ అని ఏపీఏఐ ప్రెసిడెంట్ డి.సుధాకర రెడ్డి చెప్పారు. తాజా ప్రతిపాదనలు ఎయిర్‌లైన్స్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయని కేపీఎంజీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండియా హెడ్ అంబర్ దూబే పేర్కొన్నారు. ‘తక్కువ ముడిచమురు ధరలు, ఆర్థిక వ్యవస్థ మెరుగుదల వంటి తదితర కారణాల వల్ల విమాన పరిశ్రమ గాడిలోకి వచ్చింది. ప్రజల ఆకాంక్షల పేరిట పరిశ్రమపై అధిక నియంత్రణలను విధిస్తే.. మళ్లీ గతంలోకి జారిపోవాల్సి రావొచ్చు’ అని హెచ్చరించారు. కొత్త నిబంధనలపై స్పందించడానికి విమానయాన సంస్థలకు కనీసం 4 వారాలైనా గడువివ్వాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిబంధనల వల్ల విమానయాన సంస్థల ఆదాయాలు తగ్గే అవకాశముందని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
డీజీసీఏ కొత్త ప్రతిపాదనల వివరాలివీ...
►విమానం ఆలస్యమై ప్రత్యామ్నాయ విమానాన్ని సిద్ధం చేయకపోతే.. అప్పుడు కంపెనీలు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ప్రయాణికులకు పరిహారం చెల్లించాలి. ప్రస్తుతం పరిహారం రూ.4,000గా ఉంది. బయలుదేరాల్సిన సమయం దాటిపోయిన తర్వాత గంటలోపు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.
►విమాన సంస్థలు 15 కేజీల ఉచిత చెకిన్ బ్యాగేజ్ తర్వాత అదనపు బ్యాగే జ్‌కు సంబంధించి 20 కేజీల వరకు.. కేజీకి గరిష్టంగా రూ.100 వరకే వసూలు చేయాలి. ప్రస్తుతం సంస్థలు రూ.300 వరకు చార్జ్ చేస్తున్నాయి.
►విమానం రద్దయిన సందర్భాల్లో అన్ని చట్టబద్ధమైన పన్నులను, యూజర్ డెవలప్‌మెంట్ చార్జీలను, ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫీజులను(ఏడీఎఫ్), ప్యాసెంజర్ డెవలప్‌మెంట్ ఫీజులను (పీఎస్‌ఎఫ్) ప్రయాణికులకు తిరిగివ్వాలి. ప్రస్తుతం కంపెనీలు పీఎస్‌ఎఫ్‌ను మాత్రమే రిఫండ్ చేస్తున్నాయి. రిఫండ్‌కు ఎలాంటి అదనపు చార్జీలను తీసుకోకూడదు.
►కంపెనీల రిఫండ్‌ను దేశీ విమాన ప్రయాణానికైతే 15 రోజుల్లో, అంతర్జాతీయ ప్రయాణానికి 30 రోజుల్లోగా పూర్తికావాలి.
►విమాన ప్రయాణానికి కనీసం రెండు వారాల ముందే విమానం రద్దు విషయాన్ని ప్రయాణికులకు తెలియజేసినా, ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినా కంపెనీలు ఎలాంటి పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే 2 వారాల లోపు, 24 గంటల ముందు తెలియజేసినా షరతులు వర్తిస్తాయి.
► టికెట్ రద్దు రుసుము బేసిక్ ఫెయిర్‌కు రెట్టింపు స్థాయిలో ఉండకూడదు.
►ప్రజలు, విమానయాన సంస్థలు ఈ ప్రతిపాదనలపై వారి సూచనలు, సలహాలు రెండు వారాల్లోగా తెలియజేయాలని ప్రభుత్వం గడువునిచ్చింది. అద నపు బ్యాగే జ్‌కు సంబంధిత కొత్త నిబంధనలు జూన్ 15 నుంచి అమల్లోకి రావొచ్చని సివిల్ ఏవియేషన్ డెరైక్టర్ జనరల్ ఎం.సథియవతి తెలిపారు. కొత్త నియమాలకు విమానయాన సంస్థల నుంచి వ్యతిరేకత ఉండకపోవచ్చన్నారు.