సాక్షి, న్యూఢిల్లీ: రోజుకు కావాల్సిన నిద్రకన్నా తక్కువ గంటలు నిద్రపోతే గుండెపోటు, డిమెన్షియా, స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉందని ఇంతకాలం వైద్యులు చెబుతూ వచ్చారు. రోజుకు కావాల్సిన దానికన్నా ఎక్కువ గంటలు నిద్రపోతే, అంటే దాదాపు పది గంటలు నిద్ర పోతే గుండెపోటు వచ్చి గుటకాయస్వాహా అనడానికి రెట్టింపు ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఇప్పుడు తాజా పరిశోధనలో తేల్చారు.
రోజుకు ఐదు గంటలకన్నా తక్కువ సేపు నిద్రపోతే మనిషిలో గుండెపోటు వచ్చే ప్రమాదం 52 శాతం ఉంటుందని, అదే పది గంటలు నిద్రపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం రెండింతలు పెరుగుతుందని 4,60,000 మందిపై జరిపిన పరిశోధనల ద్వారా బ్రిటీష్ వైద్యులు తేల్చి చెప్పారు. జన్యుపరంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ, కావాల్సినంత శరీర వ్యాయామం చేస్తున్నప్పటికీ పది గంటల వరకు నిద్ర పోయే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం రెట్టింపు అవుతుందని వారు చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియోలోజి’ అనే పత్రికలో ప్రచురించారు.
గుండెపోటు వచ్చే అవకాశం జన్యుపరంగా ఉన్న వారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్రపోతే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని కూడా వారంటున్నారు. ఎక్కువ గంటలు నిద్రపోతే గుండెలో రక్తప్రవాహం మందగించి గుండెలో మంట, నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని, తక్కువ గంటలు నిద్ర పోవడం వల్ల జన్యువులు నశించి గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం వల్ల తక్కువ గంటలు నిద్రపోతారు. లేదా ఇతరత్ర బిజీ ఉండడం వల్ల కొందరు తక్కువ గంటలు నిద్ర పోతారు. ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే ఆరు కన్నా తక్కువ గంటలు నిద్రపోయేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 20 శాతం పెరుగుతుందని, అదే తొమ్మిది గంటలకన్నా ఎక్కువ సేపు నిద్రపోయే వారికి గుండెపోటు వచ్చే అవకాశం 34 శాతం పెరుగుతుందని పరిశోధనా వ్యాసాన్ని రాసిన డాక్టర్ సెలైన్ వెట్టర్ వివరించారు. అందుకనే ఏమో ‘అతి నిద్రా లోలుడు తెలివిలేని మూర్ఖుడు’ అంటూ తెలుగు సినీ గేయ రచియిత ఓ పాట రాశారు.
Comments
Please login to add a commentAdd a comment