
ఆ సీఎం ప్రధాని అవుతారని అద్వానీ భావించారు!
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొందరు నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వస్తుండగా, మరికొందరు కేంద్రంలో చోటు దక్కించుకునే పనిలో ఉన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీ విజయం సాధించడం, ఆపై మెజార్టీ పార్టీగా అవతరించకున్నా.. గోవా, మణిపూర్‌లలో చక్రం తప్పి అధికారాన్ని హస్తగతం చేసుకుంటోంది బీజేపీ. ఈ క్రమంలో మనోహర్ పారికర్ రక్షణమంత్రి పదవికి రాజీనామా చేసి, తన సొంత రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. గోవా సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదే తరహాలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కేంద్రం నుంచి పిలుపొచ్చిందని, ఆయనకు రక్షణశాఖ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఆ వదంతులను సీఎం శివరాజ్ ఖండించక పోవడంతో అది నిజమై ఉండొచ్చునని భావిస్తున్నారు. ఒకానొక దశలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ.. శివరాజ్ చౌహన్ ప్రధాని అవుతారని, ఆ పదవికి ఆయన సమర్ధుడని భావించారట. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో కన్నా అద్వానీతో శివరాజ్‌కు సత్సంబంధాలు ఉండేవి. 2005 నవంబర్ 28న తొలిసారిగా శివరాజ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వ్యాపమ్ కుంభకోణం, అక్రమ మైనింగ్, డంపర్ స్కామ్ లాంటి సమస్యలను ఆయన ఎదుర్కొని నిలబడ్డారు.
ప్రస్తుతం రక్షణశాఖ అదనపు బాధ్యతలను అరుణ్ జైట్లీకి అప్పగించారు. బీజేపీ సీనియర్ నేత హితేష్ బాజ్‌పాయ్ మాత్రం ఈ వదంతలును కొట్టిపారేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివరాజ్ నేతృత్వంలోనే బీజేపీ బరిలోకి దిగుతుందని చెబుతున్నారు. శివరాజ్ కేంద్రానికి వెళ్లాలనుకుంటే ఇదే సరైన సమయమని, లేని పక్షంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందించయినా కేంద్రానికి షిఫ్ట్ అవుతారని పార్టీ సీనియర్ నేతలు విశ్వసిస్తున్నారు.