ఇస్రో గగనతలంపై అనుమానాస్పద విహారం
ఇస్రో గగనతలంపై అనుమానాస్పద విహారం
Published Tue, Dec 15 2015 11:26 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM
చెన్నై: తమిళనాడు తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఉపరితలంపై అనుమానాస్పదంగా ఏదో ఎగురుతోందన్న వార్తలు కలకలం సృష్టించాయి. దీనిపై స్థానిక గొర్రెల కాపరులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన నెలకొంది.
ఇస్రోకు సమీపంలోని నిషిద్ధ ప్రదేశం ఏడో వాచ్ టవర్ దగ్గర ఆకాశంలో అనుమానాస్పదంగా ఎగురుతున్న విమానాన్ని చూశామని తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇక్కడ గగనతలంలో ఏదో నిగూఢంగా ఎగురుతున్న విషయాన్ని గమనించి ఆందోళన చెందామన్నారు. సమీపంలోని అటవీ ప్రాంతాల గుండా పయనిస్తూ ఇస్రో వైపు రావడాన్ని తాము స్పష్టంగా చూశామని చెప్పారు.
అయితే ఇస్రో అధికారులు మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించలేదు. అలాంటి సంకేతాలేవీ శాస్త్రీయంగా తమకు అందలేదంటున్నారు. సుమారు 55 కి.మీ దూరంనుంచే గగనతలంలో సంచరించేవాటిని కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం తమ సంస్థ కలిగి ఉందన్నారు. అయితే అటవీ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు దీనిపై సిరియస్‌గా దృష్టి పెట్టారు. గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏడో వాచ్ టవర్ దగ్గర నిఘా పెట్టారు. సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు గొర్రెల కాపరులను ప్రశ్నిస్తున్నారు. వారు చూసిన వస్తువు ఏమై ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
Advertisement