నేతాజీ అదృశ్యంపై నెహ్రూ ఏం చెప్పారంటే..!!
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర పోరాటయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి శనివారం ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించిన వర్గీకృత పత్రాల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
తాజా పత్రాల ప్రకారం.. నేతాజీ చనిపోయారనే విషయాన్ని 1962లోనే ఆయన కుటుంబ సభ్యులకు అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తెలియజేశారు. బోస్ సోదరుడు సురేశ్ చంద్రబోస్ ఈ మేరకు 1962 మే 13న నెహ్రూ ఓ లేఖ రాశారు. అయితే నేతాజీ మరణం గురించి కచ్చితమైన, ప్రత్యక్షమైన ఆధారాలేవీ తాను పంపలేకపోతున్నానని, అయితే, నేతాజీ మరణం గురించి పరిస్థితులను బట్టి లభిస్తున్న ఆధారాలను విచారణ కమిషన్‌కు అందజేశానని ఈ లేఖలో ఆయన వెల్లడించారు.
'ఎక్కడోచోట నేతాజీ రహస్యంగా బతికి ఉంటే ఆయనను గొప్ప ఆనందంతో, ఆత్మీయతతో భారత్‌కు ఆహ్వానించవచ్చు. కానీ ఆ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సమయం కూడా చాలా మించిపోయింది. ఇది పరిస్థితులకు అనుగుణమైన ఆధారాలకు బలం చేకూరుస్తోంది' అని నెహ్రూ తన లేఖలో పేర్కొన్నారు. నేతాజీ చనిపోయిన విషయాన్నే పశ్చిమ దేశాలు కూడా చెప్తున్నాయని నెహ్రూ పేర్కొన్నారు.
తైవాన్‌లోని తైపీలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు ఈ అంశంపై 25 ఏళ్లపాటు జరిగిన దర్యాప్తు స్పష్టం చేస్తున్నదని బ్రిటన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.