కోల్‌కతా: పెనుతుపాను ఉంపన్ ధాటికి పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు రోజుల క్రితం పెను విధ్వంసం సృష్టించిన తుపాను గాయాల నుంచి బెంగాల్ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఉంపన్ బీభత్సంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్తును తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు. ‘ఇంత భయంకరమైన తుపానును నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నేను షాక్ అయ్యాను. మేము ఎవరితోనూ మాట్లాడలేకపోయాం. మేము సిద్ధం చేసిన మ్యాప్ ఉంది. దీన్ని ఆధారంగా ఉంపన్ తుఫాను కారణంగా ప్రభావితమైన దేశంలోని ప్రతి ప్రాంతానికి వెళ్తామ’ని మమతా బెనర్జీ అన్నారు. ఉంపన్ తుపాను తీరం దాటిన తరువాత పరిస్థితిని తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మినాఖాన్, సందేశ్‌ఖాలి, నామ్‌ఖానా, గోసాబా, కుల్తాలి, కుల్పి, కాక్‌డ్విప్, ఫాల్టా ప్రాంతాల్లో పర్యటిస్తారని ఆమె చెప్పారు. ఉంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఉంపన్ తుపాన్‌తో బెంగాల్‌లో 80 మంది వరకు మృతి చెందగా, భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. (ఉంపన్.. కోల్‌కతా వణికెన్)
రాష్ట్రపతికి కృతజ్ఞతలు
కష్ట కాలంలో తమకు దన్నుగా నిలిచిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ‘తుఫాను కారణంగా తలెత్తిన సంక్షోభ సమయంలో వ్యక్తిగతంగా నాకు ఫోన్‌చేసి బెంగాల్ ప్రజల గురించి ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా, మాకు అండగా నిలిచినందుకు గౌరవనీయ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జీకి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. కాగా, రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీకి తుపాను నష్టం గురించి వివరించినట్టు తెలిపారు. తుపాన్ కారణంగా అతలాకుతలమైన బెంగాల్‌కు రూ. 1000 కోట్ల సాయం అందించనున్నట్టు మోదీ ప్రకటించారు. (బెంగాల్‌కు వెయ్యి కోట్ల తక్షణ సాయం)
Comments
Please login to add a commentAdd a comment