ముంబై : ముంబై నగరం పట్ల తమకున్న ప్రేమను, కృతజ్ఞతను మరోసారి చాటుకున్నారు రిలయన్స్ అంబానీ దంపతులు. గురువారం ‘ధీరుభాయ్ అంబానీ స్వ్కేర్’ను ప్రారంభించిన నీతా అంబానీ 20 మిలియన్ల ముంబై నగర ప్రజల కోసం దాన్ని దేశానికి అంకితం చేశారు. ముంబై బాంద్రా కుర్ల కాంప్లెక్స్‌లోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ఎదురుగా ఉన్న ప్రపంచ శ్రేణి బహుళ విధ వినియోగవేదిక జియో వరల్డ్ సెంటర్‌లో ‘ధీరుభాయ్ అంబానీ స్వ్కేర్’ ఒక భాగం.
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డ ధీరూభాయ్ అంబానీ దూరదృష్టి ఫలితమే ‘ధీరుభాయ్ అంబానీ స్క్వేర్’, ‘జియోవరల్డ్ సెంటర్’ అని అభిప్రాయపడ్డారు. ఈ అద్భుతమైన ఫౌంటెయిన్ అందరి హృదయాంతరాల్లో సంతోషాన్ని, విశ్వాసాన్ని నింపుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ముంబై వాసులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నారు. జియో వరల్డ్ సెంటర్‌లోని ఈ స్క్వేర్ భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేలా సందర్శకుల ఆదరణ పొందడమే కాక.. ముంబై నగర వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్తుందన్నారు.
ఈ సందర్భంగా 2000 మంది పిల్లలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్చి 12న మరో రెండు మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయనున్నట్టు నీతా అంబానీ తెలిపారు. ముంబై నగర గొప్పదనాన్ని చాటి చెప్పేలా, ముంబైనగరాన్ని అన్నిరకాలుగా సురక్షితంగా ఉంచుతున్న వారందరినీ కీర్తించేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని నీతా అంబానీ స్పష్టం చేశారు. ఇక, తమ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం నేపథ్యంలో ముంబైలోని అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో వారం రోజుల పాటు సాగే అన్నదాన కార్యక్రమాన్ని అంబానీ దంపతులు ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి 2000 మంది పిల్లలకు భోజనం వడ్డించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment