Mukesh Ambani Birthday Special: Interesting Facts About Mukesh And Nita Ambani - Sakshi
Sakshi News home page

ముకేశ్‌ అంబానీతో మూడు ముళ్లకు నీతా పెట్టిన కండీషన్‌ ఏంటో తెలుసా?

Published Tue, Apr 19 2022 2:27 PM | Last Updated on Tue, Apr 19 2022 4:45 PM

Mukesh Ambani Birthday Special: Mukesh Ambani Desperate desire Eventually Nita Ambani fulfilled - Sakshi

దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. జియోతో దేశీ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఓవైపు సంప్రదాయ పెట్రోకెమికల్‌ వ్యాపారంలో ఉంటూనే మరోవైపు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గ్రీన్‌ ఎనర్జీపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. 90.70 బిలియన్‌ డాలర్ల సంపద ముకేశ్‌ సొంతం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస గృహం అతని సొంతం. కానీ చిన్నప్పటి నుంచి ముకేశ్‌ను అంటిపెట్టుకున్న ఓ కోరిక ఇప్పటికీ సంపూర్ణంగా తీర్చుకోలేకపోతున్నారు ముకేశ్‌ అంబానీ. ఆ కోరిక ఏంటీ? ఆ కోరికను ఆయన ఎలా తీర్చుకున్నారనే అంశాలను వివిధ ఇంటర్యూల్లో ముకేశ్‌ నీతా అంబానీలు చెప్పిన వివరాల ఆధారంగా ఏప్రిల్‌ 19న ముకేశ్‌ అంబానీ బర్త్‌డే స్పెషల్‌ కథనం...


ధీరుభాయ్‌ అంబానీ యెమెన్‌లో పెట్రోల్‌ పంపులో పని చేసే రోజుల్లో ముకేశ్‌ అంబానీ అక్కడే జన్మించాడు. ఆ తర్వాత ఆ కుటుంబం ముంబైలో స్థిరపడింది. తండ్రికి ఉన్న పెట్రో కెమికల్స్‌, వస్త్ర పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ముంబైలోనే పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌లో పట్టా సాధించాడు ముకేశ్‌ అంబానీ. ఆ తర్వాత మాస్టర్స్‌ పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లాడు ముకేశ్‌. మాస్టర్స్‌ పూర్తి కాగానే తనకిష్టమైన రంగంలో కొద్ది రోజలు పని చేసి ఆ తర్వాత కుటుంబ వ్యాపారాలు చూసుకోవాలని కలగన్నాడు. అయితే మాస్టర్స్‌ మధ్యలో ఉండగానే ఇండియాకి వచ్చేయమంటూ తండ్రి నుంచి పిలుపు వచ్చింది. 

తండ్రి నుంచి పిలుపు
క్లాసురూముల్లో కంటే క్షేత్రస్థాయిలోనే ఎక్కువ జ్ఞానం, అనుభవం వస్తుందనేది ధీరుభాయ్‌ అంబానీ నమ్మకం. అందుకే కొడుకు ముకేశ్‌ను చదువు మధ్యలో ఇండియాకి వచ్చేయమన్నాడు. వచ్చి రాగానే ఉద్యోగం చేయడం నీ లక్ష్యమైతే నువ్వో మేనేజర్‌ అవుతావ్‌. ఎంట్రప్యూనర్‌గా రాణించాలంటే ఇక్కడున్న సమస్యలు ఏంటో గుర్తించు, వాటికి పరిష్కారం ఆలోచించు అంటూ చెప్పేశారు. దీంతో తన కలల ఉద్యోగాన్ని పక్కన పెట్టి తండ్రి చెప్పినట్టుగా సమస్యలను అన్వేషించే పనిలో పడ్డారు ముకేశ్‌.

కాలంతో పరుగులు
ఇదే సమయంలో టాటా, బిర్లాలతో పాటు పాలిస్టర్‌ బిజినెస్‌లోకి రిలయన్స్‌కి ఎంట్రీ లభించింది. కొత్తగా కర్మాగారం నిర్మించాల్సి వచ్చింది. దీంతో ఆ పనుల్లో బిజీ అయ్యాడు ముకేశ్‌. ఫ్యా‍క్టరీ నిర్మాణం పూర్తయ్యేసరికి అతనికెంతో ఇష్టమైన ఆ ఉద్యోగం చేయాలనే ఆశ ఎక్కడో మరుగున పడిపోయింది. కాలంతో పరుగులు పెట్టడమే అతని నిత్య జీవితం అయ్యింది.

నీతా నృత్యం
పగలు రేయి తేడా లేకుండా కష్టపడుతున్న కొడుక్కి ఓ తోడును చూడాలని నిర్ణయించుకున్నాడు ధీరుభాయ్‌. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసిన నీతా ఆయన కంటపడింది. వెంటనే తనను కలవమంటూ కబురు పంపాడు. అంత పెద్ద బిజినెస్‌మేన్‌ ఎందుకు కలవమన్నాడో తెలియక కంగారు పడుతూనే రిలయన్స్‌ ఆఫీస్‌కి వెళ్లింది నీతా. 

స్నేహం వరకే
ఇద్దరి మధ్య కాసేపు మాటలు పూర్తి కాగానే మా పెద్ద అబ్బాయిని కలవమంటూ చెప్పారు ధీరుభాయ్‌. అలా ముకేశ్‌, నీతాల మధ్య తొలి పరిచయం జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం జరుగుతూ వచ్చింది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతున్నా కానీ పెళ్లి విషయంలో కాంక్రీట్‌గా ఏదీ జరగడం లేదు. మరోవైపు ఇంత పెద్ద ఫ్యామిలీలోకి వెళితే నా ఇండివీడ్యువాలిటీ నాకు ఉంటుందా అనే ప్రశ్నలు నీతాను వేధిస్తున్నాయి.

పెళ్లి చేసుకుంటావా?
ఓ రోజు కారులో నీతా, ముకేశ్‌  ఇద్దరు కారులో ప్రయణిస్తున్నారు. ముంబైలో రద్దీగా ఉండే పెద్దార్‌రోడ్‌లో కారు ప్రయాణిస్తోంది. చుట్టూ ట్రాఫిక్‌ రద్దీ, రణగొణ ధ్వనులు, కారు మీదకే దూసుకొస్తున్నట్టుగా అటు ఇటు నడుస్తున్న జనాలు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ముకేశ్‌ ఒక్కసారిగా గొంతు సవరించుకుని.. విల్‌ యూ మ్యారీ మీ.... సే యస్‌ ఆర్‌ నో... నౌ ఇన్‌ దిస్‌ కార్‌ అంటూ మనసులో మాట చెప్పేశాడు. వెంటనే ‘పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ వన్‌ కండీషన్‌’ అంటూ తడుముకోకుండా జవాబు ఇచ్చింది నీతా.

కండీషన్స్‌ అప్లై
పెళ్లైన తర్వాత ఇంటి పట్టునే ఉండకుండా ఉద్యోగం చేయాలన్నది తన అభిప్రాయమంటూ నీతా అంబానీ కండీషన్‌ పెట్టింది. వెంటనే ఆ నిబంధనకు ముకేశ్‌ ఓకే చెప్పడంతో వాళ్ల పెళ్లి జరిగిపోయింది. అయితే పెళ్లి తర్వాత అంబానీ ధీరుభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ బాధ్యతలు నీతాకి అప్పగించారు. ఇప్పటికీ ఆ స్కూల్‌ పనులు తానే చూస్తూ దాన్ని మరింతగా విస్త్రృతం చేశారామె.

ఇద్దరి కల నెరవేరిన వేళ
పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తానన్న నీతా అంబానీకి రిలయన్స్‌ సంస్థ పరిధిలో ఎన్నో మంచి పోస్టులు ఉన్నా ధీరుభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న మతలబు ఏంటంటే ముకేశ్‌ అంబానీకి టీచింగ్‌పై ఉన్న మక్కువ. అమెరికాలో మాస్టర్స్‌ పూర్తి చేసిన తర్వాత కొంత కాలం వరల్డ్‌ బ్యాంకులో ప్రొఫెసర్‌గా టీచింగ్‌ చేయాలని కలగన్నాడు ముకేశ్‌. కానీ అది తీరకుండానే తండ్రి ఆజ్ఞలతో వ్యాపారంలోకి వచ్చేశాడు. నీతాతో మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచాక ఇద్దరికి నచ్చేట్టుగా ‘టీచింగ్‌ జాబ్‌ ’లోకి నీతాని తీసుకు వచ్చారు. వ్యాపారాలను పక్కన పెట్టిన రోజు మా సంతృప్తి కోసం టీచింగ్‌ చేస్తామంటున్నారు అంబానీ దంపతులు.
 

చదవండి: నీతా అంబానీ చెబుతున్న సక్సెస్‌ సీక్రెట్స్‌, ఆర్థిక పాఠాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement