
నితీశ్ ను ఆహ్వానించిన హార్దిక్ పటేల్
హార్దిక్ పటేల్ మంగళవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కలిశారు.
పాట్నా: గుజరాత్ లో పటేల్ సామాజికవర్గం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్ మంగళవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కలిశారు. జనవరి 28న గుజరాత్ లోని సౌరాష్ట్రలో నిర్వహించనున్న సభకు హాజరు కావాలని నితీశ్ కు ఆహ్వానించారు. ఈ సభలో పాల్గొనేందుకు నితీశ్ అంగీకరించారని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో నిర్వహించనున్న కీలక సభలో నితీశ్ పాల్గొననుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
మహారాష్ట్రకు చెందిన మరాఠా క్రాంతి మోర్చా కన్వీనర్ బ్రిగేడియర్ సుధీర్ సామంత్, రాజస్థాన్ కు చెందిన గుజ్జర్ల నాయకుడు హిమ్మత్ సింగ్ ఆహ్వానాల మేరకు ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు నితీశ్ కుమార్ అంగీకరించినట్టు త్యాగి తెలిపారు. బిహార్ లో మద్య నిషేధం విధిస్తూ నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని హార్దిక్ పటేల్ ఈ సందర్భంగా ప్రశంసించారు.