
‘అది నితీశ్ రక్తంలోనే ఉంది’
పట్నా: కాంగ్రెస్ పార్టీపట్ల వ్యతిరేకత భావం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రక్తంలోనే ఉందని బీజేపీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ అన్నారు. మహాగట్బందన్‌కు ముగింపు పలకడం ఆహ్వానించదగిన పరిణామం అని ఆయన చెప్పారు. ఎందుకంటే వారిది అసహజమైన భాగస్వామ్యం అని మోదీ వర్ణించారు. 2019నాటి ఎన్నికల్లో నితీశ్- మోదీల భాగస్వామ్యం రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించనుందని, లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి స్థానాలన్నీ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆర్జేడీ తెగదెంపులు చేసుకున్న అనంతరం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి ఆ వెంటనే బీజేపీ మద్దతు తీసుకొని తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత, సుశీల్ కుమార్ మోదీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత నితీశ్ రక్తంలోనే ఉందన్నారు. నితీశ్ గ్రాండ్ అలయన్స్ నుంచి విడిపోవడానికి తమ పార్టీ ఏమీ చేయలేదన్నారు. ఇప్పుడు కూడా ఎలాంటి కండిషన్ లేకుండానే తమ కూటమి ఏర్పడిందన్నారు. గతంలో ఎన్డీయేతో కలిసి నితీశ్ 17 ఏళ్లు పనిచేశారని గుర్తు చేశారు. బిహార్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదాకు మించిన మేలే బిహార్‌కు జరగనుందని స్పష్టం చేశారు.