
‘ఎవరెస్ట్’ను మించిన అహంకారి
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్‌పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన విమర్శలకు పదునుపెట్టారు. ప్రధాని కావాలన్న కోరికే ఆయన్ను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లేలా చేసిందని విమర్శించారు.
నితీశ్‌పై నిప్పులు చెరిగిన నరేంద్ర మోడీ
పూర్నియా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్‌పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన విమర్శలకు పదునుపెట్టారు. ప్రధాని కావాలన్న కోరికే ఆయన్ను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లేలా చేసిందని విమర్శించారు. ఆయనకున్న ఎవరెస్ట్ శిఖరాన్ని మించిన అహంకారమే బీహార్ ప్రజలకు గుజరాత్ ప్రభుత్వం తరఫున 2010లో పంపిన రూ. ఐదు కోట్ల వరద సాయాన్ని తిప్పిపంపేలా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మోడీ బీహార్‌లోని పూర్నియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీహార్‌కు తాము చేసే సాయాన్ని తిప్పి పంపబోనని నితీశ్ తొలుత ప్రకటించాలని చురకలంటించారు. అధికారంలోకి వస్తే బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు.
రాహుల్...మార్స్ నుంచి ఊడిపడ్డట్లు నీతులా?
మోడీ తన ప్రసంగంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపైనా విరుచుకుపడ్డారు. గత పదేళ్ల యూపీఏ పాలనలోని అవినీతి, ధరల పెరుగుదలపై నోరుమెదపని రాహుల్...తానేదో అంగారక గ్రహం నుంచి ఊడిపడ్డట్లుగా ప్రజలకు ఉపదేశాలు, నీతులు బోధిస్తూ ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు సెల్‌ఫోన్లను అందించినది తామేనని చెప్పుకుంటున్న రాహుల్...ఆ ఫోన్ల చార్జింగ్‌కు విద్యుత్ ఎందుకు ఇవ్వలేకపోయారన్నారు.