
సాక్షి, చెన్నై: రెండాకుల చిహ్నం తమకు దక్కడంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మదురైలో శనివారం నిర్వహించిన విజయోత్సవ వేడుకకు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంను సీఎం పళనిస్వామి శిబిరం ఆహ్వానించకపోవడం చర్చకు దారితీసింది. తామిద్దరం ఒక్కటేనని చెప్పుకుంటూ వచ్చిన సీఎం, ఈ వేడుకలో పన్నీరు ఊసెత్తకుండా ప్రసగించడం గమనార్హం. పన్నీరు శిబిరానికి సీఎం ప్రాధాన్యం ఇవ్వడంలేదని వారం రోజులుగా తమిళనాట ప్రచారం జరుగుతోంది. పన్నీరు మద్దతు ఎంపీ మైత్రేయన్ ట్విట్టర్‌లో అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రెండాకుల చిహ్నం విజయోత్సవ వేడుక పళని, పన్నీరు మధ్య విభేదాల్ని బయటపెట్టింది.
శనివారం రామనాథపురంలో ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మదురై నుంచి 120 కి.మీ దూరంలో ఉన్న రామనాథపురం వరకు రోడ్డు మార్గమంతా రెండాకులు, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితతో పాటు సీఎం పళనిస్వామి చిత్ర పటాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు హోరెత్తాయి. అయితే, ఎక్కడా పన్నీరుకు చోటు కల్పించలేదు. అలాగే మదురై తిరుప్పర గుండ్రం వద్ద వంద అడుగులతో కూడిన భారీ జెండా స్తూపాన్ని ఏర్పాటు చేశారు.
ఈ విజయోత్సవ స్తూపం శిలాఫలకంలో ఆ జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి, మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్, సీఎం పళనిస్వామి పేరును మాత్రం పొందుపరిచారు. అలాగే, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంను ఆహ్వానించకుండా ఈ వేడుక జరిగింది. తమ శిబిరానికి చెందిన ఏ ఒక్కరినీ ఈ వేడుకకు పిలవకపోవడంపై పన్నీరు మద్దతు నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక, సాయంత్రం రామనాథపురంలో జరిగిన ఎంజీఆర్ శత జయంతి వేడుకలో సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ఎడమొహం పెడమొహం అన్నట్టుగా కూర్చోవడం తమిళనాట చర్చకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment