ఇక నెలలో ఆరుసార్లేనట
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ రైల్వే రిజర్వేషన్ విధానంలో భారత రైల్వే శాఖ మరోసారి కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంటర్నెట్ ద్వారా టికెట్ల కొనుగోలుపై ఆంక్షలు విధించింది. ఇక మీదట నెలలో ఆరుసార్లు మాత్రమే రైల్వే టికెట్లను ఆన్‌లైన్లో బుకింగ్ చేసుకొనే విధంగా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ఒక నెలలో ఈ-టికెటింగ్ ద్వారా పదిసార్లు టికెట్లను బుక్ చేసుకొనే వెసులుబాటు ఉండేది. తాజా పరిణామంతో తరచూ రైళ్లలో ప్రయాణం చేసేవారికి ఇక కొత్త తలనొప్పులు మొదలైనట్టే.
రైల్వేశాఖ కొత్త నిబంధనలపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ-టికెటింగ్ విధానాన్ని ప్రమోట్ చేయాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహిరిస్తోందని ఆరోపిస్తున్నారు. చాలామంది సాధారణ ప్రయాణికులకు ఈ విధానం వల్ల అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఆన్‌లైన్ రైల్వే రిజర్వేషన్ విధానంలో చోటుచేసుకొంటున్న అక్రమాలకు తెరదించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. దళారీలను నిరోధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.