తూచ్.. అది బాంబు కాదు.. ప్లాస్టిక్ బ్యాగే!
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్టాండ్బైగా ఉంచిన విమానంలో బాంబు ఉందంటూ వచ్చినవన్నీ వదంతులేనని ఎయిరిండియా స్పష్టం చేసింది. అది బాంబు కాదని, కేవలం ఒక ప్లాస్టిక్ బ్యాగ్ మాత్రమేనని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లడానికి స్టాండ్ బైగా ఉంచిన ఎయిరిండియా బోయింగ్ 747 విమానంలో గ్రెనేడ్ లాంటి వస్తువు కనిపించడంతో భద్రతా ఏజెన్సీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అసలే మోదీకి ప్రాణభయం ఉందంటూ ఇంతకుముందు కథనాలు రావడం, ఇప్పుడు ఇలాంటి గ్రెనేడ్ తరహా వస్తువు కనిపించడంతో అంతా షాకయ్యారు.
ప్రధాని అమెరికా వెళ్లినప్పుడు అత్యవసర పరిస్థితిలో ఉపయోగించేందుకు వీలుగా ఈ విమానాన్ని ఢిల్లీలో ఉంచారు. మళ్లీ ఆయన తన పర్యటన ముగించుకుని తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాతే దాన్ని వాణిజ్యపరంగా వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత అది ముంబై వెళ్లి అక్కడినుంచి హైదరాబాద్ మీదుగా జెడ్డాకు వెళ్లింది. అది జెడ్డాలో ల్యాండ్ అయిన తర్వాతే అందులో అనుమానాస్పద వస్తువును గుర్తించారు. వెంటనే భద్రతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా.. మోదీ కోసం ఉంచిన విమానంలో బాంబు ఉందన్న కథనాలు వచ్చేశాయి. విమానాన్ని సురక్షితమైన చోటుకు చేర్చి, అక్కడ పరిశీలించారు. తీరా చూస్తే అది ప్లాస్టిక్ బ్యాగ్ మాత్రమేనని తేలింది.