ఆపరేషన్ ‘కాళి’
మెట్రో రైళ్లలో త్వరలో సీఐఎస్‌ఎఎఫ్ మహిళా సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించే దిశగా కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం (సీఐఎస్‌ఎఫ్) అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా మహిళా సిబ్బందిని నియమించనుంది. ఆపరేషన్ కాళీ పేరిట ఈ చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ కింద మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన సీఐఎస్‌ఎఫ్ మహిళా సిబ్బందిని మెట్రో రైళ్లలో మోహరించనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బోగీల్లోకి పురుషులు ఎక్కకుండా నివారించడం కోసం సుశిక్షితులైన మహిళలను ఈ బోగీల్లో నియమిస్తారు.
ఇందుకోసం సీఐఎస్‌ఎఫ్ రెండు బ్యాచ్‌ల సీఐఎస్‌ఎఫ్ మహిళా సిబ్బందికి ‘పెకిటి తిర్సియా కాళీ’ అనే ఫిలిప్పీన్స్ యుద్ధవిద్యలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం వారంపాటు జరిగింది. ఈ నెల 29వ తేదీనుంచి మూడో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. మహిళల కోసం కేటాయించిన బోగీల్లోకి పురుషులు ఎక్కకూడదనే ఆంక్షలు ఉన్నప్పటికీ దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి రోజూ పురుషులు భారీ సంఖ్యలో ఈ బోగీల్లో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రతిరోజూ 25 నుంచి 50 మంది పురుష ప్రయాణికులకు సంబంధిత మెట్రో స్టేషన్ల సేషన్ కంట్రోలర్లు రూ.250 చొప్పున జరిమానా విధిస్తున్నారు. అయినప్పటికీ మహిళా కోచ్‌లలోకి ఎక్కి దిగమంటూ మొండికేసే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. సీఐఎస్‌ఎఫ్ మహిళా సిబ్బంది అటువంటి ప్రయాణికులను బలవంతగా మెట్రో రైలునుంచి దింపడమేకాకుండా వారిని మెటో రైలు పోలీసులకు అప్పగిస్తారు. అంతేకాక ఈ మహిళలు ఈవ్ టీజింగ్ వంటి ఘటనలలోనూ మహిళా ప్రయాణికులకు అండగా నిలుస్తారు.