మతమార్పిళ్లపై ఆగని రగడ
వరుసగా రెండోరోజూ రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ: మతమార్పిడుల వ్యవహారంపై ప్రధాని మోదీ సభకు సమాధానం చెప్పాలనే డిమాండ్, క్రిస్మస్ రోజున కూడా పాఠశాలల్లో కార్యక్రమాలు కొనసాగించాలనే ప్రభుత్వ యోచనకు నిర సనగా రాజ్యసభ మంగళవారం అట్టుడికింది. విపక్షాలన్నీ ఏకమయ్యాయి. బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్టవేసేలా ప్రధానిస్పష్టమైన ప్రకటన ఇచ్చేవరకు ఊరుకోమంటూ సభాకార్యకలాపాలను అడ్డుకున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ సభ వాయిదా పడింది. సభ సజావుగా సాగటం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేకనే ఇలా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్, లెఫ్ట్, సమాజ్ వాదీ పార్టీల సభ్యులు పెద్దగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.
క్రిస్మస్ నాడు నవోదయ విద్యాలయాల్లో సెలవు బదులు ‘గుడ్ గవర్నెన్స్’ అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించాలంటూ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను సభ ముందుంచాలని సీతారాం ఏచూరి(సీపీఎం) డిమాండ్ చేశారు.ప్రతిపక్షం సభలో చర్చకు బదులు అరాచకం సృష్టిస్తోందని మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. సభ ఆరుసార్లు వాయిదాపడింది. బలవంతపు మత మార్పిడులపై ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ అంగీకరించబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంక య్యనాయుడు స్పష్టం చేశారు.
హెలికాప్టర్లకు టెండర్లు పిలవలేదు..
అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత మరో సంస్థతో అలాంటి ఒప్పందం ఏదీ జరగలేదని రక్షణమంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు తెలిపారు.
పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ యథాతథం
ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై పెంచిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే యోచనేదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి జయంత్ సిన్హా ఈ మేరకు రాజ్యసభలో లిఖిత పూర్వకంగా ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇటీవల పడిపోతున్న చమురు ధరలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ మేరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.