ఎక్కడ వినాశనం జరిగినా కేంద్ర మంత్రి ఇక్కడే!
కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ పై గోవా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ మీడియాతో మాట్లాడారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఉగ్రదాడులు జరిగినప్పుడు, మహారాష్ట్ర పుల్గావ్ లోని ఆర్మీ డిపోలో పేలుడు సంభవించినప్పుడు రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ సొంత రాష్ట్రం గోవాలోనే ఉన్నారని మండిపడ్డారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల దేశ రక్షణకే ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని ఆరోపించారు.
రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో తలదూర్చడం మాని దేశ రక్షణ వ్యవహారాలను చూసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా పారికర్ కు పుల్గావ్ కి వెళ్లి అక్కడ పరిస్థితులను చూడాలని చెప్పాలని పేర్కొన్నారు. గోవాను ఇద్దరు పరిపాలిస్తున్నారని చెప్పారు. ఒకరు ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ కాగా, రెండో వ్యక్తి మనోహర్ పారికర్ అని పేర్కొన్నారు. గోవా ముఖ్యమంత్రి ఎవరన్నది తమకు అర్థం కావడం లేదని అశుతోష్ వ్యాఖ్యానించారు.
యూపీఏ హయాంలో ఫైళ్లను చక్కబెట్టేందుకు అధికారులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసేవారని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాదు అని బీజేపీ విమర్శలు చేసేది. సీఎంగా పర్సేకర్ ఉన్నా, పారికర్ తన క్యాంపు ఆఫీసులో సెక్రటరీలు, ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. గతంలో యూపీఏ చేస్తే సహించలేదు.. ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తోందంటూ ఆప్ ముఖ్యనేతలు విమర్శించారు.