డిప్యూటీ సీఎం ఫైర్
పట్నా: 'జంగిల్ రాజ్' వ్యాఖ్యలపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిహార్ లో ఆటవిక పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు పదేపదే విమర్శించడంతో ఆయన కౌంటర్ ఇచ్చారు. అధికార జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాకీ యాదవ్ నడిరోడ్డుపై యువకుడిని కాల్చి చంపాడని ఆరోపణలు రావడంతో విపక్షాలు నితీశ్ కుమార్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బిహార్ లో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని ధ్వజమెత్తాయి. దీనిపై తేజశ్వి యాదవ్ ఘాటుగా స్పందించారు.
'బిహార్ లో జరిగిన ఘటన జంగిల్ రాజ్ కు అద్దం పడుతుందంటున్నారు. ఢిల్లీలో ఇంతకంటే ఎక్కువగా రోడ్లపై దారుణాలు జరిగాయి. అది జంగిల్ రాజ్ కాదా? మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణం, పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, జాట్ల ఆందోళన సందర్భంగా మహిళలపై అత్యాచారాలు.. జంగిల్ రాజ్ పాలనకు ఉదాహరణలు కాదా?' అని తేజశ్వి యాదవ్ ఆవేశంగా ప్రశ్నించారు.