లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు | People not taking coronavirus lockdown seriously Says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు

Published Tue, Mar 24 2020 1:12 AM | Last Updated on Tue, Mar 24 2020 1:33 AM

People not taking coronavirus lockdown seriously Says PM Narendra Modi - Sakshi

వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ ప్రభావం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. దేశవ్యాప్తంగా వ్యాధి బాధితుల సంఖ్య ఆదివారం 360 కాగా.. ఒక్క రోజు గడిచేసరికి ఈ సంఖ్య 468కు చేరుకుంది. తాజాగా పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకరు చొప్పున మరణించడంతో భారత్‌లో మరణాలసంఖ్య తొమ్మిదికి చేరింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 పరిస్థితులపై సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన సమాచారం మేరకు వ్యాధిపీడితుల సంఖ్యలో 40 మంది విదేశీయులు, మరణించిన ఏడుగురితోపాటు స్వస్థత చేకూరి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయిన 24 మంది ఉన్నారు. మరోవైపు వైరస్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా విమానయాన సర్వీసులను రద్దు చేయడంతోపాటు, లాక్‌డౌన్‌ నియంత్రణలను అధిగమించిన వారిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్రాలకు సూచనలు చేసింది. మహారాష్ట్ర, పంజాబ్‌  రాష్ట్రమంతా కర్ఫ్యూ విధించాయి.   

నిబంధనలు కచ్చితంగా పాటించాలి: మోదీ
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను చాలామంది తేలికగా తీసుకుంటున్నారని, ఈ పరిస్థితి ఏమాత్రం తగదని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘‘మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ కుటుంబాలను కూడా. లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’అని ఆయన తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. సోమవారం ప్రధాని దేశవ్యాప్త టెలివిజన్‌ ఛానళ్ల ప్రతినిధులతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ను జీవితకాలంలోనే అతిపెద్ద సవాలుగా అభివర్ణించారు.

కొత్త, వినూత్న పద్ధతుల ద్వారా మాత్రమే ఈ మహమ్మారిని అడ్డుకోగలమని అన్నారు.‘విలేకరులు, కెమెరామెన్, టెక్నీషియన్లు దేశానికి గొప్ప సేవ చేస్తున్నారు. నిరాశావాదం, ఆందోళనలను అధిగమించేందుకు మీడియా సానుకూల దృక్పథపు సమాచారాన్ని అందివ్వాలి’ అని ఆయన అన్నారు. కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు టెలివిజన్‌ ఛానళ్లు, మీడియా చేపట్టిన చర్యలను మోదీ కొనియాడారు. ‘మన ముందు ఇంకా సుదీర్ఘమైన యుద్ధం ఉంది. సామాజిక దూరంపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాలి. తాజా పరిణామాలు, కీలక నిర్ణయాలపై సమాచారం వేగంగా ప్రజలకు చేరేందుకు ఛానళ్లు, సులభగ్రాహ్యమైన భాషతో ప్రజలకు అందించాలి’అని ఆయన వివరించారు.

నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం రాష్ట ప్రభుత్వాలను కోరినట్లు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో మరో ట్వీట్‌లో తెలిపింది.  రాజధాని ఢిల్లీలోని ఔట్‌ పేషెంట్, ప్రత్యేక సర్వీసులు, కొత్త, ఫాలోఅప్‌ రోగుల విభాగాలను మంగళవారం నుంచి మూసివేయాలని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ తీర్మానించింది.  కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ, జార్ఖండ్, నాగాలాండ్‌లు రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించగా బీహార్, హరియాణా, యూపీ, పశ్చిమబెంగాల్‌లోని పలు జిల్లాల్లో దాదాపు అలాంటి నిషేధాజ్ఞలనే ప్రకటించారు. దేశం మొత్తమ్మీద 80 జిల్లాల్లో అన్ని రైళ్లను, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను మార్చి 31వ తేదీ వరకూ రద్దు చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో ఎలాంటి విరామ సమయాల్లేకుండా పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా సోమవారం అర్ధరాత్రి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.  

సామాజిక దూరంతో తగ్గుముఖం
సామాజిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తే కోవిడ్‌ కేసులు తక్కువ నమోదవుతాయని భారతీయ వైద్య పరిశోధనా కౌన్సిల్‌ చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. సామాజిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తే కోవిడ్‌కు గురయ్యే మొత్తం కేసులను 62 శాతానికి, విషమమయ్యే కేసులను 89%కి తగ్గించవచ్చని తేలింది.కరోనా వైరస్‌ అనుమానిత వ్యక్తుల్లో చేరడానికి 1–3 వారాలు పట్టవచ్చని తెలిపింది.

మోదీ కాన్ఫరెన్స్‌లో ‘సాక్షి’
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై చేస్తున్న యుద్ధంలో మీడియా ప్రతినిధుల పాత్ర అమూల్యమైందని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ‘సాక్షి’ సహా పది ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఇందులో సాక్షితో పాటుగా రిపబ్లిక్, టైమ్స్‌నౌ, ఆజ్‌తక్, ఇండియా టీవీ, న్యూస్‌ 24 తదితర చానళ్లు ఉన్నాయి. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సాక్షి మీడియా తరఫున సీఈవో వినయ్‌ మహేశ్వరి, మేనేజింగ్‌ ఎడిటర్‌ నేమాని భాస్కర్, సీనియర్‌ ఔట్‌పుట్‌ ఎడిటర్‌ శ్రీనాథ్‌ గొల్లపల్లి, ఇన్‌పుట్‌ ఎడిటర్‌ ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.  

లాక్‌డౌన్‌ను అతిక్రమించి షోలాపూర్‌లో రోడ్డుమీదకొచ్చిన ప్రయాణికుడిని తరిమికొడుతున్న పోలీసు

సోమవారం హాంకాంగ్‌లోని ఓ బేకరీ దుకాణంలో ‘మాస్క్‌లు ధరించిన జనం’లా తయారుచేసిన కప్‌కేక్‌లు


టెక్సాస్‌లో చర్చి మూసేయడంతో అక్కడే కారుపై ప్రార్థనలు చేస్తున్న ఓ కుటుంబం


వాషింగ్టన్‌లో డ్రెస్‌లు కత్తిరించి మాస్క్‌లుగా మలుస్తున్న స్థానికులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement