
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి అధికారం కట్టబెట్టేలా గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల్లో 33 బహిరంగ ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఒక్కో జిల్లాలో 3 నుంచి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రధాని ఎన్నికల షెడ్యూల్ రూపకల్పనపై కసరత్తు సాగుతున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ 20 తర్వాత మోదీ గుజరాత్ ప్రచారాన్ని ప్రారంభించే అవకాశముంది. గత అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి విభిన్నంగా మోదీ ప్రచార పర్వం ఉంటుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
నిజానికి గత 22 ఏళ్లుగా బీజేపీనే గుజరాత్‌ను పాలిస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై ప్రజా వ్యతిరేకత ప్రభావం పడకుండా రక్షణాత్మక ధోరణితో బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రం కుల సమీకరణాలతో బలమైన కూటమి ఏర్పాటు దిశగా కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కులతత్వాన్ని రెచ్చగొట్టేలా రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఇప్పటికే ఆరోపించారు. పటీదార్ వర్గ నేత హార్దిక్‌తోపాటు ఓబీసీ వర్గానికి చెందిన అల్పేశ్ ఠాకూర్, ఎస్పీ వర్గానికి చెందిన జిగ్నేష్ మేవానీల్ని కాంగ్రెస్ ఇప్పటికే తనవైపుకు తిప్పుకుంది. అలాగే జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని కాంగ్రెస్ ఎక్కువగా ప్రచారం చేస్తోంది. జీఎస్టీ శ్లాబుల్లో తాజా మార్పులతో ప్రజల ఆగ్రహాన్ని కొంతైనా చల్లార్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే జీఎస్టీపై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మాత్రం మోదీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
గుజరాతీయుల మనసు మార్చే వ్యూహంతో..
గుజరాత్ అభివృద్ధి కోసం కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని 2012 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఆరోపించారు. ఈసారి కేంద్రంలోను, రాష్ట్రంలోను ఒకే ప్రభుత్వం ఉండడంతో గుజరాత్ అభివృద్ధిపై ఆ రాష్ట్ర ప్రజల్ని మోదీ ఏ మేరకు నమ్మిస్తారో వేచిచూడాలి. మోదీ ప్రధానిగా ఉన్నప్పటి కంటే సీఎంగా ఉన్నప్పుడే తమ పరిస్థితి బాగుండేదని ఆ రాష్ట్ర ప్రజల్లో బలపడుతున్న ఆలోచనా ధోరణిని ఎదుర్కోవడం ఆయన ముందున్న మరో సవాలు. ఈ ప్రతికూలతల నేపథ్యంలో ఎలాగైనా గుజరాత్ ప్రజల్ని తమ వైపునకు తిప్పుకునేలా మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు భారీ ప్రచార పర్వానికి తెరతీస్తున్నారు.