సాక్షి, న్యూఢిల్లీ : చైనాలో పుట్టిన కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగాన్ని మోగిస్తోంది. రోజు రోజుకు విస్తరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ ప్రపంచ యుద్ధాలకంటే తీవ్రమైన ఆందోళన రేపుతోందని మోదీ పేర్కొన్నారు. మొత్తం మానవజాతినే ప్రమాదంలోకి నెట్టేసిందని మోదీ వ్యాఖ్యానించారు. గత రెండు నెలలుగా ఈ సంక్షోభం ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోందన్నారు. అయితే ఈ విషయంలో భారతదేశం విజయం సాధిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. అయితే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు రేగడం సహజం. కానీ ప్రజలు అప్రమత్తంగా వుండి, ఈ వైరస్ బారినుంచి సురక్షితంగా బయటపడవచ్చు అని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. మనం ఆరోగ్యంగా వుంటే.. ప్రపంచం ఆరోగ్యంగా వుంటుంది. సంకల్పం, అప్రమత్తత మాత్రమే కరోనాకు మందు అని ప్రధాని సూచించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచమంతా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. సాధారణంగా ఎప్పుడైనా, ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏవో కొన్ని దేశాలకు లేదా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ, ప్రస్తుతం వచ్చిన ఈ సంక్షోభం ప్రపంచ ప్రజలందరినీ విపత్తులోకి ముంచివేసింది. తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ ఇన్ని దేశాలలో ప్రభావం కనిపించలేదు. ఈ రోజు కరోనా దుష్ప్రభావం అనేక దేశాలలో కనిపిస్తోంది. గత రెండు నెలలుగా నిరంతరం ప్రపంచమంతా కరోనా వైరస్ కు సంబంధించి విషాదకర వార్తలు వస్తున్నాయి. మనం వింటూ ఉన్నాం. గత రెండు నెలలుగా భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా విజృంభించిన కరోనా వైరస్ ను ప్రతిఘటిస్తున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి గురించి నిశ్చింతగా ఉండడమనేది అంత సులువైన అంశం కాదు. అందువల్ల ప్రతి ఒక్క భారతీయుడు జాగ్రత్తలు పాటించి, అప్రమత్తులై ఉండాలి. ఇది చాలా అవసరం.
సంకల్పం, సంయమనం అవసరం..
నేను కోరినప్పుడు నా దేశవాసులందరూ ఆ కోరికను మన్నించారు. నన్ను ఏనాడు నిరాశపర్చలేదు. మీ అందరి ఆశీర్వాద బలంతో మన ప్రయత్నాలన్నీ సఫలమవుతున్నాయి. ఈ రోజు నేను భారతీయులందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. ముందు ముందు రాబోయే మీ సమయంలో కొన్ని వారాలు నాకు కావాలి.
ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు మన విజ్ఞానం ఎలాంటి ఉపాయాన్ని అందించలేకపోయింది. ఈ రోగానికి ఎలాంటి టీకా మందులను ఎవరూ కనిపెట్టలేకపోయారు. ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కడెక్కడైతే విజృంభించిందో, అక్కడ ఒక విషయం తేటతెల్లమైంది. ఈ దేశాలలో ప్రారంభావస్థలో కొన్నిరోజుల తర్వాత అనుకోకుండా ఉన్నట్టుండి అకస్మాత్తుగా భయంకరమైన రీతిలో వ్యాధి ప్రబలింది. ఈ దేశాలలో కరోనా వ్యాధి సంక్రమించిన వారి సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. భారత ప్రభుత్వం ఈ స్థితిపై నిఘా వేసింది. కరోనా వ్యాప్తి చెందే తీరుపై దృష్టి సారించింది. కొన్ని దేశాలు వెంటనే నిర్ణయం తీసుకున్నాయి. వ్యాధి సోకినవారిని ఇతరులకు దూరంగా పెట్టి ఈ పరిస్థితులను అధిగమించాయి. 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో, నిరంతరం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న మన దేశం ముందుకు కరోనా విపత్తు రావడం సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపించడాన్ని మనం చూస్తున్నాం. అయితే, దీని ప్రభావం భారత్ పై పడదని భావించడం తప్పు. ప్రపంచ స్థాయి లో విజృంభిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు అంశాలు అవసరం.. మొదటిది సంకల్పం, రెండవది సంయమనం. ప్రపంచంలోని ప్రజలందరినీ ఇబ్బందికి గురిచేస్తున్న ఈ మహమ్మారిని నియంత్రించేందుకు దేశ పౌరులుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అందరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శక సూత్రాలను పాటిద్దాం. ఈ రోజు మనం సంకల్పం చేసుకోవాలి. ఈ వ్యాధి మనకు రాకుండా చూసుకోవాలి. ఇతరులు కూడా ఈ వ్యాధిబారిన పడకుండా చర్యలు చేపట్టాలి.
తప్పనిసరైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి
ప్రపంచస్థాయిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మనకు కార్యసాధనను అందించే మంత్రం ఒక్కటే. మన ఆరోగ్యమే ప్రపంచ ఆరోగ్యం. ఈ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి తప్పనిసరిగా మనకు కావల్సింది సంయమనం. సంయమనం అంటే ‘గుంపుల నుంచి దూరంగా ఉండడం’ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండడం. ఈ రోజుల్లో దీనినే సామాజికంగా దూరంగా ఉండడం అంటారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ తరుణంలో ఇది చాలా అవసరం. మన సంకల్పం, సంయమనం ఈ ప్రపంచ మహమ్మారి దుష్ప్రభావాన్ని తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. అంతమాత్రాన మీరు ఆరోగ్యంగా ఉన్నారని, మీకేం కాదని, కరోనా నుంచి రక్షింపబడతారని ఆలోచించడం సరైంది కాదు. దానివల్ల మీరు, మీతోపాటు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేసిన వారవుతారు. అందువల్ల మనదేశ పౌరులందరికీ నా మనవి ఏమిటంటే, రానున్న కొన్ని వారాలపాటు బయటకు రాకూడదు. తప్పనిసరైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. సాధ్యమైనంత వరకు మీ పనులను, వాణిజ్య కార్యకలాపాలు కానివ్వండి, ఆఫీసుకు సంబంధించిన పనులను ఇంటి నుంచే చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది క్రియాశీలంగా పనిచేయడం అవసరమే. అయితే, సమాజంలోని ఇతరులందరినీ, మీతోపాటు సమాజానికి దూరంగా ఉంచాలి. నాదొక మనవి.. మన కుటుంబంలోని వయో వృద్ధులు, అరవై అయిదు సంవత్సరాలు పైబడినవారు, వీరంతా ఒక వారం వరకు ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దు. నేటి తరానికి ఈ విషయం తెలియకపోవచ్చు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఈ వేళలో మనం కూడా అటువంటి ప్రక్రియలను అనుసరించక తప్పదు.
జనతా కర్ఫ్యూ...
నేను ప్రతిఒక్క భారతీయ పౌరుడి నుంచి ఒక మద్ధతును కోరుతున్నాను. అదే ‘జనతా కర్ఫ్యూ’ .. ప్రజల కర్ఫ్యూ. ‘ప్రజల కర్ఫ్యూ’ అంటే ప్రజల ద్వారా ప్రజలే విధించుకున్న కర్ఫ్యూ. ఈ ఆదివారం(మార్చి 22)వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పౌరులందరూ ‘జనతా కర్ఫ్యూ’ను పాటించాలి. ఈ సమయంలో మనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదు. రోడ్ల మీదకి రాకూడదు. వీధుల్లో సంచరించరాదు. అత్యవసరమైన పనులకు మాత్రమే మార్చి 22న ప్రజలు బయటకు వెళ్లాలి. మార్చి 22వ తేదీన మనం పాటించే ఈ సంయమనం, చేసే ప్రయత్నం, దేశ సంక్షేమానికి చేపట్టిన సంకల్పానికి ప్రతీకగా నిలిచిపోతుంది. మార్చి 22న విధించుకునే ప్రజా కర్ఫ్యూ విజయం, దాని నుంచి నేర్చుకున్న అనుభవాలు మున్ముందు రాబోయే సవాళ్లకు మనల్ని సంసిద్ధుల్ని చేస్తాయి. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ నా మనవి ఏమిటంటే, ప్రజా కర్ఫ్యూ అమలుకు సారథ్యం వహించాలి. ఇందుకోసం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ల సేవలతో సంబంధాలున్న యువతీ యువకులు, పౌర సమాజం, ఇతర సంస్థలు అన్నింటికీ నేను చేసే మనవి ఏమిటంటే.. ఇప్పటి నుంచి రాబోయే రెండు రోజులు ప్రజా కర్ఫ్యూ ను గురించి ప్రజలలో చైతన్యాన్ని కలుగజేయాలి. అందుకు వారిని సంసిద్ధులను చేయాలి. అవసరమైతే.. ప్రతి ఒక్క వ్యక్తి కనీసం 10 మందికి ఫోన్ చేసి కరోనా వైరస్ నుంచి తప్పించుకునే ఉపాయాలను వివరించాలి. అలాగే.. జనతా కర్ఫ్యూ గురించి కూడా వివరించాలి.
మన కోసం శ్రమిస్తున్న వారి కోసం..
ఈ జనతా కర్ఫ్యూ అనేది మనకు, మనదేశానికి ఒక పరీక్షా సమయం లాంటిది. ఇదే సమయంలో ప్రపంచ స్థాయిలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారితో పోరాటం చేయడానికి భారత్ ఏ మాత్రం సంసిద్ధంగా ఉందనే అంశాన్ని తెలుసుకోవాల్సిన తరుణమిది. మీ ప్రయత్నాలు ఈ దిశలో సాగుతుండగా.. ప్రజా కర్ఫ్యూ రోజున మార్చి 22న మీ నుంచి మరొక సహకారం నేను పొందగోరుతున్నాను. గత రెండు నెలలుగా లక్షలాది మంది సిబ్బంది ఆస్పత్రులలో, విమానాశ్రయాలలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. వారు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఆస్పత్రి సిబ్బంది కావచ్చు, సఫాయి కర్మచారి సోదర సోదరీమణులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, రైల్వే సిబ్బంది, బస్సు, ఆటోరిక్షా లాంటి సేవలకు సంబంధించిన వ్యక్తులు, హోం డెలివరీ చేసే వారు, వీరంతా తమ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా, ఇతరుల సేవలో నిమగ్నులై ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు చేసే సేవలు అసాధారణమైనవి. వీళ్లకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అయినప్పటికీ వీరు తమ కర్తవ్య నిర్వహణలో రేయింబవళ్ళు నిమగ్నమై ఉన్నారు. పరోపకార పరాయణత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మనకు, కరోనా మహమ్మారి కి మధ్యలో నిలబడి ఉన్నారు. వీరికి దేశమంతా కృతజ్ఞతలు చెబుతోంది. నా కోరిక ఒక్కటే. మార్చి 22వ తేదీ ఆదివారం నాడు మనం ఇటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు సమర్పించాలి. ఆదివారం సరిగ్గా 5 గంటలకు మనం అందరమూ ఇంటి వాకిటి వద్ద నిలబడి, బాల్కనీలో గాని, లేదా కిటికీల దగ్గర గాని నిల్చొని 5 నిమిషాల పాటు ఇటువంటి వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి. చప్పట్లు కొట్టడం ద్వారా, ప్లేట్లను వాయించడం ద్వారా, లేదా గంట కొట్టడం ద్వారా వీరందరికీ వందనాలు సమర్పించాలి. వీరి మనోబలాన్ని ద్విగుణీకృతం చేయాలి. దేశంలోని స్థానిక ప్రభుత్వాలకు నా మనవి ఒక్కటే. మార్చి 22వ తేదీన సరిగ్గా 5 గంటలకు సైరన్ మోత వినిపించడం తోనే ప్రజలకు ఈ సందేశాన్ని అందించాలి. మన సంస్కారం సేవాహీ పరమో ధర్మః. దీనిని ప్రజలందరికీ తెలియచేయాలి. శ్రద్ధ తో ఈ భావాన్ని అభివ్యక్తం చేయాలి.
ఎకనామిక్ టాస్క్‌ఫోర్స్
ఈ విపత్కర సమయం లో మీరందరూ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అత్యవసర సేవలకు డిమాండ్ పెరిగిపోతోంది. మన ఆస్పత్రులపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. అందువల్ల నా మనవి ఒక్కటే. నియమిత చర్య గా చేసుకునే వైద్య పరీక్షల కోసం వీలైనంత వరకు ఆస్పత్రుల చుట్టూ తిరగడం ఆపివేయాలి. మీకు అత్యవసరమైతే.. మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్లండి. మీ కుటుంబ వైద్యుడి దగ్గరకు వెళ్లవచ్చు. లేదా మీ బంధువులలో ఎవరైనా వైద్యులు ఉంటే.. ఫోన్ చేసి అవసరమైన సలహాలను పొందవచ్చు. మీరు ఏదైనా శస్త్ర చికిత్స చేసుకోవాలనుకుంటే.. ముందుగా తేదీని నిర్ణయించుకుని ఉంటే.. దానిని వాయిదా వేసుకోండి. ఒక నెల రోజుల తరువాత ఆ కార్యక్రమాన్ని పెట్టుకోండి. కరోనా మహమ్మారి దుష్ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ ను అతలాకుతలం చేసేసింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థికమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఒక ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టాస్క్ ఫోర్స్ అవసరమైన వారందరితో మాట్లాడుతూ.. ప్రతిస్పందనలను స్వీకరిస్తూ పరిస్థితులను అంచనా వేస్తూ వీలైనంత త్వరలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో అవసరమైన చర్యలను చేపట్టేందుకు ఈ టాస్క్ ఫోర్స్ సముచిత నిర్ణయం తీసుకుంటుంది. వాటిని అమలు చేస్తుంది కూడా. ఈ మహమ్మారి కారణంగా మధ్యతరగతి ప్రజల, పేద ప్రజల ఆర్థికాభివృద్ధి కి విఘాతం కలిగింది. ఈ విపత్కర సమయం లో మన దేశంలోని వ్యాపారవర్గాలకు అత్యధిక ఆదాయమున్న ప్రజలకు మనవి చేసేది ఏమిటంటే అవసరమైతే మీరు ఎవరి నుంచి సేవలు పొందుతున్నారో వారి ఆర్థిక సంక్షేమాన్ని గురించి ఆలోచించండి. ఇటువంటి వారు కొన్ని రోజుల పాటు ఆఫీసు కు రాలేకపోవచ్చు. మీ ఇంటికి రాకపోవచ్చు. ఇలాంటి స్థితి లో వీరి జీతాల్లో కోతల ను విధించవద్దు. సంపూర్ణమైన మానవతా దృక్పథంతో స్పందిస్తూ నిర్ణయాలు తీసుకోండి. ఒక సంగతి ని నిరంతరం జ్ఞాపకం పెట్టుకోండి.. వారు కూడా వారి కుటుంబాలను కాపాడుకోవాల్సి ఉంది. కుటుంబ సభ్యులను కరోనా బారి నుంచి సంరక్షించుకోవలసి ఉంటుంది. మన దేశ వాసులందరికీ కావలసిన పాలు, తినుబండారాలు, మందులు, జీవితానికి అవసరమైన ఇతర సామగ్రి.. వీటన్నింటి కి ఏ మాత్రం లోటు రాకుండా చూసుకోవాలి. అందువల్ల దేశ ప్రజలందరికీ అనవసరమైన సామగ్రి ని సేకరించే కార్యక్రమాలు చేపట్టవద్దని మనవి చేస్తున్నాం. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే మామూలుగానే కొనుక్కోండి. అంతేగాని నిత్యావసర వస్తువులను భయాందోళనలతో కొనేసి దాచిపెట్టకండి.
దృఢసంకల్పంతో ముందుకు సాగాలి..
గత రెండు నెలలుగా 130కోట్ల మంది భారతీయులలో ప్రతి ఒక్క పౌరుడు దేశం ఎదుర్కొంటున్న ఈ విపత్తు ను తన విపత్తు గా భావించారు. ప్రతిఒక్కరూ తనకు చేతనైనంతగా సేవలందించారు. మున్ముందు కూడా మీరందరూ మీ కర్తవ్యాలను నిర్వహిస్తారని, బాధ్యతలను నెరవేరుస్తారని నా నమ్మకం. ఇటువంటి సమయాలలో కొన్ని ఇబ్బందులు రావడం సహజం. కొన్ని వదంతులు వ్యాపించి వాతావరణమంతా విచిత్రంగా మారిపోవచ్చు. కొన్నిసార్లు పౌరుడి గా మన కోరికలు కొన్ని తీరకపోవచ్చు. ఏది ఏమైనప్పటికి, ఈ విపత్కర సమయం లో దేశ ప్రజలందరూ ఈ కష్టాల మధ్యలోనే దృఢసంకల్పం తో ఇబ్బందులన్నింటిని ఎదుర్కోవాలి. మనమందరమూ కలసి కరోనా ను ఎదుర్కోవడంలో మన సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. దేశం లో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి.. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి.. స్థానిక సంస్థలు కానివ్వండి.. పంచాయతీ లు కావచ్చు.. ప్రజాప్రతినిధులు కావచ్చు.. పౌర సంఘాలు కావచ్చు.. ప్రతి ఒక్కరూ మహమ్మారి ని తరిమి కొట్టడానికి వారి వంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలి. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ వాతావరణం లో మానవాళి కి విజయం చేకూరాలి. మన దేశం విజయపథం లో మున్ముందుకు సాగాలి. ఇంకా కొద్ది రోజులలో నవరాత్రి పండుగ రానుంది. ఇది శక్తి ఉపాసన కు సంబంధించిన పర్వదినం. భారతదేశం దృఢశక్తి తో ప్రగతిపథం లో ముందంజ వేయాలి. మీకు ఇవే నా శుభాకాంక్షలు. మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment