ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం..
న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఛైర్మన్ గా ఉండే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ జూలై 16న ముఖ్యమంత్రులతో సమావేశం కానునుంది. పాఠశాల విద్య, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ స్కీమ్, ఆధార్ కార్డ్, ఆర్థిక, సామాజిక అంశాల ప్రణాళికలపై ఈ ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నారు. మోదీ ప్రభుత్వంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు కురిపిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ వేదికపై సమస్యలను చర్చించే అవకాశం ఉంది.
ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 11 వ సమావేశం జూలై 16వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రాల్లో సమస్యలు, సంబంధాలు, భద్రత, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి అంశాలతోపాటు, పాఠశాల విద్య, ఆధార్ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పదేళ్ళ తర్వాత ఈ 11వ ముఖ్యమంత్రుల సమావేశం జరగడం విశేషం. కౌన్సిల్ కు ఛైర్మన్ గా ఉన్న ప్రధానమంత్రి మోదీ.. కేబినెట్ లోని ఆరుగురు మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కారీ, మనోహర్ పారికర్ ల ను కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అంతేకాక మరో 11 మంది శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న మంత్రులు సైతం ఈ సమావేశంలో పాల్గొంటారు. కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు ఇతర అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని సమస్యలతోపాటు, దేశవ్యాప్తంగా ప్రధాన సమస్యలను చర్చిస్తారు.
పదేళ్ళ క్రితం 2006 లో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. యూపీఏ ప్రభుత్వ పదేళ్ళ హయాంలో కేవలం రెండుసార్లు మాత్రమే కౌన్సిల్ మీటింగ్ జరిగింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 అనంతరం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రూపాన్ని కొంతవరకూ మార్చింది. జూలై 16 నిర్వహించే 11వ సమావేశంలో అనేక సమస్యలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.