పార్టీల నిందాపర్వం; ప్రధాని సంతాపం
ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య ఘటనపై రాజకీయ పార్టీల నిందాపర్వం మొదలైంది. ఒకవైపు రైతు ఆత్మహత్యకు పాల్పడుతుండగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా ఆప్ నేతలంతా ప్రసంగాలపైనే దృష్టి పెట్టారంటూ బీజేపీ ఆరోపించింది. ‘మీకు ప్రాణాలు ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా?’ అని ప్రశ్నించింది. దీన్ని హత్యగా భావించి, ర్యాలీ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ఘటనకు ఢిల్లీ పోలీసులే బాధ్యులని ఆప్ పేర్కొంది. గజేంద్ర ఆత్మహత్యకు పాల్పడుతుండగా, అక్కడే ఉన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘ఆత్మహత్య బాధాకరం. ఆ రైతు కుటుంబాన్ని ఓదార్చేందుకు మాటలు లేవు. ఆ వ్యక్తిని చెట్టుపై నుంచి కిందకు దింపమని పోలీసులకు చెబ్తూనే ఉన్నాం. పోలీసు శాఖ మా అధీనంలో లేకపోయినా.. కనీసం మానవత్వంతోనైనా స్పందించాల్సింది’ అన్నారు. ‘మరోసారి ఎవరైనా ఇలాగే ఆత్మహత్యకు ప్రయత్నిస్తే.. చెట్టెక్కి ఆ వ్యక్తిని రక్షించమని కేజ్రీవాల్‌కు చెబుతా’ అని మరో నేత అశుతోశ్ వ్యంగ్యంగా అన్నారు. రైతు ఆత్మహత్యకు ప్రధాని మోదీ, కేజ్రీవాల్‌లే బాధ్యులని, వారిపై ఆత్మహత్యకు పురిగొల్పిన నేరారోపణ కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత సత్యవ్రత్ చతుర్వేది డిమాండ్ చేశారు. ఇలాంటి బాధాసమయంలో ఎలాంటి వ్యాఖ్యలూ చేయాలనుకోవడం లేదని రాహుల్ అన్నారు.
ఒంటరివారమని అనుకోకండి.. మోదీ
ఢిల్లీలో రైతు ఆత్మహత్యపై తీవ్ర ఆవేదనకు, ఆసంతృప్తికి గురయ్యానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎప్పుడు తాము ఒంటరివారిమన్న భావన తమలో రానీయవద్దని రైతాంగానికి సూచించారు. రైతులకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు తామంతా ఉన్నామన్నారు. రైతు గజేంద్ర కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. దేశంలో నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం లోతును, రైతుల్లో నెలకొని ఉన్న అసంతృప్తిని ఈ ఘటన వెల్లడిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యకు ప్రధాని మోదీ బాధ్యుడని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ విమర్శించారు. ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో గజేంద్ర కుటుంబసభ్యులను పరామర్శించారు. గజేంద్ర ఆత్మహత్యపై రాజస్తాన్ సీఎం వసుంధర రాజే విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు.
మీదే బాధ్యత.. కాదు మీదే!
Published Thu, Apr 23 2015 2:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement