వివిధ దేశాల్లో రాజకీయ పక్షాల ఎన్నికల వ్యూహాల తయారీకి ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ‘కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ)’ సంస్థ దుర్వినియోగం నేపథ్యంలో... భారత్‌లో ఎన్నికల సందర్భంగా ప్రచార వ్యూహాలు ఏ విధంగా రూపొందిస్తారు ? అందుకోసం ప్రజల నుంచి సమాచారాన్ని ఏయే రూపాల్లో సేకరిస్తారు ? దానిని ఏ విధంగా సమన్వయం చేసి, ప్రచారరూపాలుగా మళ్లీ ప్రజల్లోకి రాజకీయపార్టీలు ఎలా తీసుకెళుతున్నాయన్నవి ఆసక్తి రేపే ప్రశ్నలు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ఇంతవరకు ప్రధాన రాజకీయపార్టీలు అనుసరించే వ్యూహాలు, సమాచార సేకరణ, వ్యాప్తిలో తీసుకొస్తున్న కొత్త పోకడలు, ముఖ్యంగా 2014 ఎన్నికల్లో చేపట్టిన ప్రచార కార్యాచరణ , సహకరించిన వ్యక్తులు, సంస్థలు, ఇప్పుడు అనుసరించబోయే పద్ధతులు ఏమిటన్నది చర్చనీయాంశమవుతోంది.
డేటాదే కీలక పాత్ర...
వివిధ రూపాల్లో ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, ఎన్నికల సందర్భంగా చర్చకు వచ్చే అంశాలు, సమస్యలు, ఓటర్ల మొగ్గును బట్టి కొన్ని సంస్థలు రాజకీయ పక్షాల కోసం ప్రచార వ్యూహాలు రూపొందిస్తాయి. అయితే ఫేస్‌బుక్ వినియోగదారులకు తెలియకుండా వారి ఆంతరంగిక సమాచారాన్ని విశ్లేషించి సీఏ సంస్థ అక్రమంగా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం అనేక ప్రశ్నలను ముందుకు తెస్తోంది. భారత్‌లోనూ సామాజిక మాధ్యమాల విస్తృతి బాగా పెరిగిన నేపథ్యంలో ప్రజల నుంచి సేకరించే వివరాలను ఏ విధంగా ఉపయోగిస్తారనేది కీలకంగా మారింది. ప్రధానంగా రాజకీయపార్టీలు, సంస్థలు భారత జనాభా లెక్కల సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ డేటా విషయంలో ఎన్నికల సంఘం విడుదల చేసే వార్డుస్థాయిలో వివిధపార్టీలకు పడిన ఓట్ల వివరాలు ముఖ్యభూమికను పోషిస్తున్నాయి. ఈ సమాచారాన్ని బట్టి నియోజకవర్గస్థాయి పరిస్థితిని పార్టీలు అంచనావేస్తున్నాయి. వీటి ఆధారంగా ఓటర్ల మనోభావాలు, ఎన్నికల అంశాలు వెల్లడవుతున్నాయి. అయితే ఓబీసీ, ఇతర కులాలకు సంబంధించిన సమాచారం తేలిగ్గా అందుబాటులో లేకపోవడంతో వాటి సేకరణకు రాజకీయపక్షాలు సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ మొత్తం డేటా విశ్లేషణ, దాని వినియోగానికి ప్రాముఖ్యత ఏర్పడడంతో ఈ రంగంలో అనుభవమున్న సంస్థలు, వ్యక్తుల ద్వారా పార్టీలు ఈ పనిని నిర్వహిస్తున్నాయి.
పబ్లిక్ డొమెయిన్ సమాచారం ముఖ్యమే..
2019 ఎన్నికల్లో 90 కోట్లకు పైగా ఓటర్లు పాలు పంచుకోనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్, జనాభా లెక్కలు, జాతీయ శాంపిల్ సర్వే సంస్థ సేకరించి, విడుదల చేసిన సమాచారానికి అనుగుణంగానే విశ్లేషణ చేపడుతున్నట్లు ఆస్ట్రమ్ సంస్థ వ్యవస్థాపకుడు అశ్వినీ సింగ్లా వెల్లడించారు. దేశంలో శాస్త్రీయంగా ఎన్నికల సమాచార నిర్వహణను చేపట్టినదిగా ఈ సంస్థకు పేరుంది. వేలాది వాలంటీర్లను ఇంటింటికి పంపించి సమాచారాన్ని సేకరణతో పాటు, ఓటర్లతో సంభాషణల ఆధారంగా డేటాను రూపొందించి విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఓటరు భిన్నమైన ఆలోచనా ధోరణి, అభిప్రాయాలతో ఉండడంతో పాటు భాషా, కులం, సామాజిక, ఆర్థిక స్థాయిల్లో అంతరాలు వంటి అంశాలతో భారత్‌లో పరిస్థితి సంక్షిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంటింటి సమాచార సేకరణను ప్రామాణికంగా తీసుకుని ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు సింగ్లా చెప్పారు. తమ బృందం సేకరించిన డేటా ఆధారంగా పంచాయతీ నుంచి సాథారణ ఎన్నికల వరకు సరళిని అంచనా వేస్తున్నామన్నారు. తాను ఏ పార్టీతో కలిసి పనిచేసిన విషయాన్ని వెల్లడించకపోయినా ఆ సంస్థ వెబ్‌సైట్‌లో మాత్రం గత ఎన్నికల్లో నరేంద్రమోదీ విజయానికి కృషి చేసినట్టు పేర్కొన్నారు. ఓటర్ల వివరాలతో క్షేత్రస్థాయి సమాచారాన్ని క్రోడీకరించి ఓటరు తీరుపై ఏయేఅంశాలు ప్రభావితం చూపుతున్నాయి, ఎవరిని అభ్యర్థిగా పెడితే మంచిదనే దానిపై ఒక అంచనాకు వస్తామన్నారు. ఎన్నికల కంటే ఎంతో ముందుగానే ఓటరుతో పార్టీ మమేకం అయ్యేందుకు ఇది ఉపయోగపడినట్టు నిరూపితమైందని ఆయన చెబుతున్నారు. వివిధ దొంతరలుగా సేకరించిన సమాచారం బూత్‌స్థాయి కార్యకలాపాలకు ఎంతో ఉపకరిస్తుందని, అంతిమంగా ఎన్నికల వ్యూహం రూపొందించేందుకు ఈ డేటానే అత్యంత కీలకమని పేర్కొన్నారు.
బీజేపీకి సొంత టీమ్...
పార్టీ ఎన్నికల వ్యూహానికి సంబంధించి, ఓటర్ల డేటాను విశ్లేషించేందుకు బీజేపీ సొంతంగా తన బృందాన్ని వినియోగిస్తోంది. ఈ జాతీయ సమాచార, సాంకేతిక విభాగానికి అమిత్ మాలవియా నేతృత్వం వహిస్తున్నారు. అంకెల రూపంలోని ఓటర్ల సమాచారంతో పోలింగ్‌బూత్ స్థాయిలో తమ బృందం పనిచేస్తుందని, దీనిపై విశ్లేషణ కుదిరాక దానికనుగుణంగా పార్టీ రాజకీయ వ్యూహం ఖరారు చేస్తుందని అమిత్ చెప్పారు. గత ఎన్నికల్లో విజయానికి కచ్చితమైన సమాచార, పౌరసంబంధాల వ్యూహంతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా బీజేపీకి ఉపయోగపడింది. ఈ వ్యూహానికి తోడు అన్ని సాంకేతికతల మిశ్రమంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారం, మొబైల్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు సహా అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగించడం వల్ల 543 నియోజకవర్గాల్లో 11.36 లక్షల పోలింగ్ బూత్‌లలో 81 కోట్ల ఓటర్లు లక్ష్యంగా ప్రచారం జరిపినట్లు బీజేపీ జాతీయ సాంకేతిక విభాగ అధిపతి అరవింద్ గుప్తా వెల్లడించారు. ఎన్నికలకు 3,4 ఏళ్లకు ముందు నుంచే సమాచార సేకరణ, శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషణ, 2009 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడిన బూత్‌ల గుర్తింపు ప్రాతిపదికన ప్రతీ పోలింగ్ బూత్‌ను చేరుకున్నట్టు తెలిపారు.
కాంగ్రెసూ వెనకబడి లేదు...
బీజేపీ మాదిరిగానే కాంగ్రెస్‌పార్టీకి కూడా జాతీయస్థాయిలో ఎన్నికల ప్రక్రియ, డేటా పర్యావేక్షణ, విశ్లేషణకూ ఓ టీం ఉంది. పొలిటికల్ ఎకానమిస్ట్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో డేటా విశ్లేషణ విభాగాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించారు. అందుబాటులో ఉన్న డేటాను మరింత లోతుగా విశ్లేషించడం అటు వ్యాపారాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ కొత్తేమి కాదని చక్రవర్తి వ్యాఖ్యానించారు. డేటా అంటే వ్యక్తిగతమైనదో, గోప్యమైనదో కాదని ఎన్నికల సమాచారంతో పాటు పార్టీ కార్యకర్తలు సేకరించిన వివరాలు, అందుబాటులోని పబ్లిక్ డేటాను నిపుణులతో కూడిన తమ బృందం విశ్లేషిస్తుందన్నారు. వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రతా విషయంలో భారత్‌లో సరైన పరిరక్షణ చట్టాలు లేనందున రాజ్యాంగం కల్పించిన ప్రైవేసీహక్కును ఏ మేరకు రక్షించగలమనేది సందేహాస్పదమేనని టెక్నాలజీ లాయర్ అపర్ గుప్తా చెబుతున్నారు. అయితే ఓటర్ల ఆదాయం, అక్షరాస్యతకు సంబంధించి అందులోకి వస్తున్న కొత్త సమాచారం వల్ల కులాలకు అతీతంగా ఎన్నికల ప్రచార నిర్వహణకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment