
వీఐపీ ఆర్టీఐ కిందకు రారా?
* ప్రియాంక గాంధీ భూమి కొనుగోలు వివరాలను బయట పెట్టాల్సిందే
* హిమాచల్ సమాచార కమిషన్ ఆదేశం
సిమ్లా: ప్రియాంక గాంధీ హిమాచల్‌ప్రదేశ్‌లో కొన్న భూమి వివరాలను సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. వీఐపీ అయినంత మాత్రాన ఆర్‌టీఐ చట్టం కిందకు రామని ఎవరూ చెప్పజాలరని పేర్కొంది.
సిమ్లాకు దగ్గర్లోని ఛరాబ్రాలో ప్రియాంక భూమి కొన్నారు. వ్యవసాయేతర అవసరాలకు వ్యవసాయభూమిని కొనుగోలు చేసినపుడు కొన్ని షరతులతో అనుమతిస్తారు. ఆమెకు ఏ మినహాయింపులిచ్చారు, పెట్టిన షరతులేమిటి అని తెలుసుకోవడానికి సమాచారహక్కు కార్యకర్త దేవాశిష్ భట్టాచార్య ఆర్టీఐ కింద సమాచారం కోరారు. మాజీ ప్రధాని కూతురుగా ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్‌పీజీ) భద్రత ఉంది.
ఛరాబ్రాలో భూమి కొనుగోలుకు సంబంధించి వివరాలను వెల్లడిస్తే ప్రియాంక భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎస్‌పీజీ లేఖ రాసిందని, అందువల్ల ఈ వివరాలను బహిర్గతం చేయలేమని మొదటి అప్పీలేట్ అథారిటీ సమాధానమిచ్చారు. దీన్ని భట్టాచార్య రాష్ట్ర సమాచార కమిషన్ ముందు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై జూన్ 29న ఆదేశాలను వెలువరిస్తూ చైర్మన్ భీమ్ సేన్, సభ్యులు కాళిదాస్‌లతో కూడిన బెంచ్ తీవ్రవ్యాఖ్యలు చేసింది. ఎస్‌పీజీ భద్రతలో ఉండే ప్రధాని సహా ఇతరులందరూ ఎన్నికల్లో తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరుస్తున్నారని పేర్కొంది.
ప్రియాంక భద్రతపై ఎప్‌పీజీ డెరైక్టర్ రాసినట్లు చెబుతున్న లేఖ నిజమైనదో కాదో నిర్ధారించుకోకుండా అప్పిలేట్ అథారిటీ ఎలా ఆదేశాలు జారీచేస్తారని ప్రశ్నించింది. ఎప్‌పీజీ భద్రత కల్పిస్తోంది ప్రియాంక ప్రాణాలకేగాని ఆమె ఆస్తులకు కాదని కటువుగా వ్యాఖ్యానించింది. అసలు ఎప్‌పీజీకి అలా లేఖ రాసే అధికారమే లేదంది. ఆర్టీఐ దరఖాస్తుదారు కోరిన వివరాలను పది రోజుల్లోపల ఇవ్వాలని ఆదేశించింది.