దేశంలో ఏకపక్ష పాలన: రాహుల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోట్లాదిమంది భారతీయులను ఒకే వ్యక్తి తన ఏకపక్ష నిర్ణయాలతో శాసిస్తున్నారని ప్రధానిని ఉద్దేశించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ఎవ్వరికీ చెప్పకుండా తీసుకున్న పెద్దనోట్ల నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా తిరోగమనం వైపు నెట్టేసిందని దుయ్యబట్టారు. రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 94వ జన్మదినంతోపాటు ఆయన ఎమ్మెల్యే అయ్యి 60 ఏళ్లు అయిన సందర్భంగా వజ్రోత్సవాలను శనివారం చెన్నైలో వైభవంగా నిర్వహించారు.
అనారోగ్యంతో కరుణానిధి వేడుకకు రాలేదు. ఈ వేడుకలకు రాహుల్‌తోపాటు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, సీపీఐ, సీపీఎంల ప్రధాన కార్యదర్శులు సురవరం సుధాకర రెడ్డి, సీతారాం ఏచూరి తదితర ప్రముఖులు విచ్చేశారు. ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ పెద్ద నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రధాని కనీసం ఆర్థికమంత్రికి కూడా చెప్పలేదని, కేవలం ఒకే వ్యక్తి ఆలోచనలతో ఈ దేశం నడుస్తోందని విమర్శించారు.