కశ్మీర్పై రేపు అఖిలపక్ష భేటీ
♦ మితవాదులు, ఇతరులతో చర్చలకు సిద్ధం: సర్కారు ప్రకటన
♦ కశ్మీర్ ప్రజల బాధను మేం పంచుకుంటున్నాం: రాజ్యసభ
♦ భారత్‌లో పాక్ అనుకూల నినాదాలను సహించం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: కశ్మీరీల బాధను తాము పంచుకుంటున్నామంటూ, లోయలో శాంతి, సామరస్యాలను పునరుద్ధరించాలని ఆ రాష్ట్ర ప్రజలకు పార్లమెంటు ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేసింది. మితవాద గ్రూపులు, ఇతరులతో చర్చలు జరపటానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈ అంశంపై శుక్రవారం(ఈ నెల 12న) అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయనుంది.ఈ పరిస్థితులపై రాజ్యసభలో బుధవారం ఆరు గంటలకు పైగా చర్చ జరిగింది. తర్వాత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చర్చకు బదులిస్తూ.. కశ్మీర్‌ను సైన్యానికి అప్పగించే ప్రశ్నే లేదన్నారు. ఉద్రిక్తత నెలకొన్న కశ్మీర్‌కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపించే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాను ప్రధాని మోదీ తరఫున మాట్లాడుతున్నానని చెప్తూ.. కశ్మీర్ అంశంపై శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని, ప్రధాని హాజరవుతారని చెప్పారు.
ఏ శక్తీ కశ్మీర్‌ను లాక్కోలేదు
కశ్మీర్‌లో పెల్లెట్ తుపాకుల వాడకాన్ని నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేయగా.. అత్యధిక సంయమనం పాటించాలని జవాన్లకు చెప్పామని, కానీ జాతీయ భద్రత విషయంలో రాజీ ఉండబోదని, భారత భూభాగంపై పాకిస్తాన్ అనుకూల నినాదాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. కశ్మీర్ అంశంపై పాక్‌తో ఎటువంటి చర్చలైనా సరే.. ఆ దేశం ఆక్రమణలో ఉన్న భూభాగం గురించే ఉంటాయని పేర్కొన్నారు. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించాలని కోరుతూ పాక్ ప్రధాని ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖను ప్రస్తావిస్తూ భూమి మీద ఏ శక్తీ కశ్మీర్‌ను తమ నుంచి లాక్కోజాలదన్నారు.
ఏకగ్రీవ తీర్మానం...: చర్చలో 29 మంది సభ్యులు మాట్లాడారు. తర్వాత.. ‘కశ్మీర్ లోయలోని అలజడి, హింస, కర్ఫ్యూలపై సభ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. క్షీణిస్తున్న పరిస్థితులతో ప్రజలు ప్రాణాలు కోల్పోవటం, తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర ఆవేదన తెలియజేస్తోంది. జాతీయ భద్రతపై రాజీకి తావు లేనప్పటికీ.. ప్రజల కష్టాలను తొలగించటానికి శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం అత్యవసర చర్యలు చేపట్టటానికి అంతే ప్రాధాన్యత ఉందని సభ దృఢ విశ్వాసం. సాధారణ పరిస్థితిని, సామరస్యాన్ని సత్వరం పునరుద్ధరించటానికి కృషి చేయాలని కశ్మీర్‌లోని అన్ని వర్గాల వారికీ సభ విజ్ఞప్తి చేస్తోంది’ అన్న తీర్మానాన్ని రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.