
న్యూఢిల్లీ: పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరపాలన్నది నాటి ప్రభుత్వ సాహసోపేత నిర్ణయమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఈ పరీక్షలు అంతర్జాతీయంగా భారత్ పట్ల ఉన్న వైఖరిని మార్చివేశాయనీ, భారత వైజ్ఞానిక సామర్థ్యాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వానికి ఉన్న ధైర్యాన్ని, సాహసాన్ని పోఖ్రాన్ అణు పరీక్షలు ప్రతిబింబించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
రాజస్తాన్‌లోని థార్ ఎడారిలో 1998 మే 11, 13 తేదీల్లో భారత్ భూగర్భంలో ఐదు అణు పరీక్షలను జరిపింది. ఈ ఘట్టానికి శుక్రవారంతో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని పోఖ్రాన్–2 అణు పరీక్షలను, ఈ పరీక్షలు జరిపిన శాస్త్రవేత్తలకు నేతృత్వం వహించిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను గుర్తుచేసుకున్నారు.