
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దల్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్
పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దల్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సరిగ్గా తీసుకోలేక పోతుండటంతో శనివారం ఆయనను ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రి వైద్యులు లాలూకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. పలు అవినీతి కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఆయన కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి సందర్భంగా మూడురోజుల పెరోల్‌పై బయటికి వచ్చారు.
అయితే కొన్ని అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మే11న రాంచీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన ఆరు వారాల ప్రొవిజినల్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన మీడియాతో మాట్లాడటంపై నిషేధాన్ని విధించింది. లాలూకు సంబంధించిన ప్రతి కదలికను వీడియోలో రికార్డు చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. లాలూకు బీహార్, జార్ఖండ్ పోలీసుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది.